ఖమ్మంమయూరిసెంటర్: ఇందిరా మహిళా డెయిరీ నిర్వహణకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేసి, పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం ఆయన అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి ఇందిరా మహిళా డెయిరీపై అధికారులతో సమీక్షించారు. తొలుత కలెక్టర్ ఈ కార్యక్రమానికి సంబంధించి బడ్జెట్ త్వరగా విడుదల చేయాలని ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి, మైనారిటీ శాఖల ఉన్నతాధికారులతో కలెక్టర్ ఫోన్‌లో కోరారు. అనంతరం ఆయన మహిళా డెయిరీకి అవసరమైన మౌలిక వసతులు, ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టాల్సిన పనులకు అనుమతులు, గేదెల పంపిణీ, పశువుల షెడ్ల నిర్మాణంపై సూచనలు చేశారు. డీఆర్‌డీఓ శ్రీరామ్, సీపీఓ శ్రీనివాస్, బీసీ, ఎస్సీ, మైనార్టీ అభివృద్ధి శాఖల అధికారులు జి.జ్యోతి, ముజాహిద్, పశు సంవర్థక శాఖ అధికారి డాక్టర్ బి పురంధర్, పంచాయతీరాజ్ ఈఈ మహేష్, విజయ డెయిరీ డీడీ కె.రవికుమార్‌తో పాటు జయశ్రీ, ఎస్.విజయ్‌చంద్ర పాల్గొన్నారు.
పారదర్శకంగా ఎస్‌ఐఆర్
ఖమ్మం సహకారనగర్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిష్పాక్షికంగా చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి శనివారం వీసీ ద్వారా ఎస్‌ఐఆర్, మ్యాపింగ్ పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ షెడ్యూల్ ప్రకారం జూన్ 15నుంచి 24 వరకు సన్నాహక చర్యలు, శిక్షణ చేపట్టాలని తెలిపారు. ఇక జూన్ 25నుంచి జూలై 24 వరకు బీఎల్‌ఓలు ప్రతీ ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను ధ్రువీకరించే సమయాన పకడ్బందీగా వ్యవహరించాలని చెప్పారు. ఆపై జూలై 31న ము సాయిదా ఓటరు జాబితా విడుదల చేసి, అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరించాక తుది జాబితాను అక్టోబర్ 1న ప్రచురించనున్నట్లు తెలిపారు. జిల్లా నుంచి వీసీకి హాజరైన కలెక్టర్ దివాకర మాట్లాడుతూ జిల్లాలో ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియలో పురోగతి, ఇతర అంశాలను వివరించారు. ఆతర్వాత అధికారులతో సమావేశమైన ఆయన నివాసాలకు వెళ్లినప్పుడు ధ్రువపత్రాలు లేకపోతే ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం వ్యవహరించాలని సూచించారు. అదనపు కలెక్టర్ పి.శ్రీజ, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు సబ్‌కలెక్టర్ అజయ్‌యాదవ్, ఆర్డీఓ శ్రీనివాస్, ఎన్నికల విభాగం ఉద్యోగులు రాజు, అన్సారీ పాల్గొన్నారు.
లైసెన్స్‌డ్ సర్వేయర్లకు విస్తృత ఉపాధి
లైసెన్స్‌డ్ సర్వేయర్లకు భవిష్యత్‌లో విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని కలెక్టర్ దివాకర తెలిపారు. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి లైసెన్స్‌డ్ సర్వేయర్లతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ భూ భారతి పోర్టల్ మ్యాపింగ్ అమల్లోకి వచ్చినందున తిరుమలాయపాలెం మండలంలో రీ సర్వే నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో కొందరు సర్వేయర్లను వినియోగించుకుంటామని, రానున్న రోజుల్లో అన్ని గ్రామాల్లో అమల్లోకి వస్తే సర్వేయర్లకు పని, ఆదా యం లభిస్తాయన్నారు. ప్రైవేట్ వ్యక్తులు సర్వేలు చేయించుకున్నా ఆదాయం వస్తుందని తెలిపారు. అయితే, క్షేత్రస్థాయిలో తప్పు చేస్తే లైసెన్స్ రద్దుచేస్తామన్నారు. విధానమైన నిర్ణయాలు, సమస్యలపై ప్రభుత్వానికి తెలియచేస్తామని వెల్లడించారు. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ రాజేందర్ పాల్గొన్నారు.
ధాన్యం దిగుమతుల్లో జాప్యం లేదు
ధాన్యం దిగుమతుల్లో ఎక్కడా జాప్యం జరగడం లేదని కలెక్టర్ దివాకర స్పష్టం చేశారు. ‘సాక్షి’లో శనివారం ‘దిగుమతుల్లో జాప్యం’ శీర్షికన ప్రచురితమైన కథనంపై స్పందించిన ఆయన ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 309 కేంద్రాల ద్వారా కొనుగోళ్లు జరుగుతున్నాయని, ఆపై ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నామని తెలిపారు. నేలకొండపల్లి మండలంలోని రాజేశ్వరపురం మిల్లులోనూ 80మంది హమాలీల ద్వారా రోజుకు 30 – 32 లారీల మేర దిగుమతులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. నిల్వలు పేరుకుపోకుండా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యాన పర్యవేక్షిస్తున్నందున రైతులు అపోహలకు గురికావొద్దని సూచించారు.
కలెక్టర్ దివాకర టీఎస్


