ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలతో పాటు ప్రభుత్వ ఐటీఐలోని అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్(ఏటీసీ)లో మొదటి దఫా ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కన్వీనర్, టేకులపల్లిలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఏ.శ్రీనివాసరావు తెలిపారు. ఆసక్తి, అర్హతలు ఉన్న విద్యార్థులు https:/iti.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా ఈనెల 25నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.
డీఎల్‌ఈడీ కోర్సులో
ప్రవేశానికి దరఖాస్తులు
భద్రాచలంటౌన్: భద్రాచలంలోని ప్రత్యేక గిరిజన డీఎల్‌ఈడీ కళాశాలలో 2026–28 విద్యాసంవత్సరానికి తెలుగు మీడియంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. ఏజెన్సీ షెడ్యూల్ ప్రాంత గిరిజన అభ్యర్థులు ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఇంటర్‌లో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు అర్హులని, 50 సీట్లను మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా భర్తీ చేస్తామని పేర్కొన్నారు. భద్రాచలం డీఎల్‌ఈడీ కళాశాలతో పాటు ఏటూరునాగారం, ఉట్నూరు, మన్ననూరు ఐటీడీఏ కార్యాలయాల్లో దరఖాస్తులు ఉచితంగా లభిస్తాయని, వివరాలకు 99595 75539, 86390 84543 నంబర్లలో సంప్రదించాలని పీఓ సూచించారు.
ప్రశాంతంగా గురుకుల కళాశాలల ప్రవేశపరీక్ష
ఖమ్మంమయూరిసెంటర్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు శుక్రవారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. భద్రాద్రి జోన్ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని 9 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించినట్లు జోనల్ అధికారి కె.అలివేలు వెల్లడించారు. ఖమ్మం జిల్లాలోని ఆరు కేంద్రాల్లో 2,519 మంది విద్యార్థులకు గాను 2,232 మంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మూడు కేంద్రాల్లో 1,217 మంది విద్యార్థులకు గాను 1,014 మంది హాజరయ్యారని తెలిపారు.
పంట వ్యర్థాలను కాల్చొద్దు
వైరా: రైతులు పంట వ్యర్థాలను కాల్చడం ద్వారా భూసారాన్ని పాడు చేసుకోవద్దని జిల్లా వ్యవసాయ శాఖాధికారి డి.పుల్లయ్య సూచించా రు. వైరా మండలం సోమవరం గ్రీన్‌ఫీల్డ్ హైవే పక్కన నిప్పంటిన వరి కొయ్యలను శుక్రవారం ఆయన ఆర్పివేయించారు. అనంతరం డీఏఓ వరి కొయ్యలను కాల్చడం వల్ల జరిగే నష్టాలను రైతులకు వివరించారు. మంటలతో భూసారాన్ని పెంచే సూక్ష్మ జీవులు చనిపోవడమే కాక, సమీపంలోని పంట నిల్వలకు నష్టం జరుగుతుందని తెలిపారు. ఈమేరకు రైతులెవరైనా నిప్పంటిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. వైరా ఏఓ మయాన్ మంజుఖాన్, ఏఈఓ మేడా రాజేష్ పాల్గొన్నారు.
డెంగీ నివారణకు
విస్తృత అవగాహన
ఖమ్మంవైద్యవిభాగం: డెంగీ బారిన పడకుండా ప్రజల్లో విస్తృత అవగా హన కల్పించడం ద్వారా వ్యాధి కట్టడికి కృషి చేస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రామారావు తెలిపారు. జాతీయ డెంగీ దినోత్సవాన్ని శనివారం నిర్వహించనుండగా, శుక్రవారం ఖమ్మంలో ఆయన మాట్లాడారు. డెంగీపై ప్రజల్లో అవగాహన కల్పించడం, నివారణ చర్యలను విస్తృతం చేయడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. శుభ్రమైన నిల్వ నీటిలో పెరిగి, పగటి సమయాన మాత్రమే కుట్టే దోమల ద్వారా డెంగీ వ్యాప్తి చెందుతుందని చెప్పారు.
జాగ్రత్తలు తప్పనిసరి
డెంగీ నివారణను ప్రజలు వ్యక్తిగత బాధ్యతగా భావించాలని డీఎంహెచ్‌ఓ సూచించారు. ఇంటి పరిసరాలు, కూలర్లు, డ్రమ్ములు, పూలకుండీలు, కొబ్బరి చిప్పలు, టైర్లలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని తెలిపారు. అలాగే, దోమల నివారణ కోసం దోమ తెరలు వినియోగించాలని, డెంగీ లక్షణాలు కనిపిస్తే స్వీయ వైద్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని చెప్పారు. ప్రధానంగా పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కాగా, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన లార్వా నిరోధక, ఫాగింగ్, ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నట్లు డీఎంహెచ్‌ఓ రామారావు తెలిపారు.


