● బుగ్గపాడు ఫుడ్‌పార్క్‌లో కదలిక ● రూ.600 కోట్లతో ఆక్వా పరిశ్రమల ఏర్పాటుకు ఎంఓయూ ● ప్రారంభమైతే 3వేల మందికి ప్రత్యక్ష ఉపాధి
సత్తుపల్లి: రాష్ట్రంలోనే తొలిసారి ఆక్వా పరిశ్రమలకు అడుగు పడింది. ఇదికూడా జిల్లాలోని సత్తుపల్లి మండలం బుగ్గపాడు ఫుడ్‌పార్కులో ఏర్పాటుకానుండడం విశేషం. రూ.650 కోట్ల వ్యయంతో ఇక్కడ ఫుడ్‌పార్కులో రెండు ఆక్వా(రొయ్య) పరిశ్రమల ఏర్పాటుకు నిర్ణయించారు. సుమారు 84 ఎకరాల విస్తీర్ణంలో చేపలు, రొయ్య ఫీడ్(దాణా) తయారీకి ఒక పరిశ్రమ, రొయ్యల ప్రాసెసింగ్, ఎగుమతులకు మరో పరిశ్రమ స్థాపనకు దీపక్ నెక్స్‌జన్ కంపెనీ ముందుకొచ్చింది. ఈ పరిశ్రమలు ప్రారంభమైతే సుమారు మూడు వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. ఇదే కంపెనీ ఏపీలోని హనుమాన్ జంక్షన్‌లో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుచేయగా, బుగ్గపాడు పార్క్‌లో ఏడాదిలోపు అందుబాటులోకి వచ్చే అవకాశముందని చెబుతున్నారు.
రైతులకు ప్రోత్సాహం
ఆక్వా పరిశ్రమలు నిలదొక్కుకోవాలంటే సమీపాన రొయ్యల చెరువులు ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. ఈమేరకు సత్తుపల్లి, చుట్టుపక్కల ప్రాంతాల్లోని సుమారు 2వేల ఎకరాల్లో చెరువుల ఏర్పాటుకు రైతులను ప్రోత్సహిస్తారు. ఇక్కడి భూమి చేపలు, రొయ్యల చెరువుల ఏర్పాటుకు అనుకూలంగా ఉండడాన్ని కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. రొయ్యల చెరువులకు ీఫీడ్(దాణా) కూడా అందించి ఉత్పత్తిని పెంచేలా కంపెనీ యాజమాన్యం కృషి చేయనుంది. దాణా కోసం ఈ ప్రాంతంలో పండే మొక్కజొన్న, సోయా ఉత్పత్తులకు సైతం డిమాండ్ వస్తుంది. అయితే, స్థానికంగా రొయ్యలు అందుబాటులోకి వచ్చే వరకు ఏపీ నుంచి రొయ్యలను తీసుకొచ్చి ప్రాసెసింగ్ చేసి ఎగుమతి చేస్తారు. చైనా, జపాన్, ఇండోనేషియా, అమెరికా దేశాలకు ఆక్వా ఉత్పత్తులను పంపించే అవకాశముంది. ఇటీవల ప్రారంభమైన గ్రీన్‌ఫీల్డ్ హైవే బుగ్గపాడు ఫుడ్‌పార్క్‌కు 24 కి.మీ. దూరంలోనే ఉండడంతో పోర్ట్‌లకు రవాణా సులభమవుతుందని భావిస్తున్నారు.
వైఎస్సార్ హయాంలో ప్రారంభం
దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన చేతుల మీదుగా 2008 జనవరి 27న 203 ఎకరాల విస్తీర్ణంలో బుగ్గపాడు ఫుడ్‌పార్క్ ఏర్పాటు చేశారు. ఇందులో 60 ఎకరాలను మౌలిక వసతులకు కేటాయించి రూ.119 కోట్లతో పనులు చేపట్టారు. మిగిలిన 143 ఎకరాల్లో రూ.10 కోట్లతో రహదారులు, ప్రహరీ, ఆఫీస్ భవనం నిర్మాణం చేశారు. కాగా, ఫుడ్‌పార్క్‌లో గతేడాది నుంచి వైఅండ్‌వై కంపెనీ మామిడి ప్రాసెసింగ్, జ్యూస్ కంపెనీని ఏర్పాటు చేసినా ఇది కేవలం సీజన్‌లోనే నడుస్తోంది. ఇప్పుడు రెండు ఆక్వా పరిశ్రమలు ప్రారంభం కానుండడంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.
సీఎం సమక్షాన ఒప్పందం
ఫుడ్‌పార్క్‌ను అభివృద్ధిలో భాగంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గతేడాది పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి పరిశ్రమల మేళా ఏర్పాటు చేశారు. దీంతో పలు కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇటీవల దీపక్ నెక్స్‌జన్ కంపెనీ యాజమాన్యం.. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సమక్షాన రెండు పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. తెలంగాణలోనే తొలి ఆక్వా పరిశ్రమలు కావడంతో ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. ఏపీకి సత్తుపల్లి సరిహద్దుగా ఉండడంతో అక్కడి రైతుల మాదిరి ఇప్పటికే కొందరు స్థానిక రైతులు ఆక్వా పరిశ్రమపై ఆసక్తితో చేపలు, రొయ్యల చెరువుల తవ్వకానికి ముందుకొస్తున్నారు. త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఫ్యాక్టరీ శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది.


