రైతులు ఇబ్బంది పడకుండా మక్కల కొనుగోళ్లు | - | Sakshi
Sakshi News home page

రైతులు ఇబ్బంది పడకుండా మక్కల కొనుగోళ్లు

May 15 2026 10:32 AM | Updated on May 15 2026 10:32 AM

కూసుమంచి: రైతులు పండించిన మొక్కజొన్నలు మొత్తం కొనుగోలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ గోపి తెలిపారు. కేంద్రాల్లో రైతులు ఇబ్బంది పడకుండా కొనుగోళ్లు వేగంగా చేపట్టడమే కాకుండా గోదాంలకు తరలిస్తామని వెల్లడించారు. కూసుమంచి మండలం జీళ్లచెరువులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మక్కల కాంటా పూర్తయి రోజులు దాటుతున్నా గోదాములకు తరలించడం, ఫలితంగా వేచి ఉండాల్సి వస్తోందని రైతులు వివరించారు. దీంతో హమాలీల సంఖ్య పెంచడంతో పాటు రవాణాకు సరిపడా వాహనాలు సమకూర్చాలని డైరెక్టర్‌ అధికారులకు సూచించారు. రెండు, మూడు రోజుల్లో సమస్యలను అధిగమిస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో ఏడీఏ సతీష్‌, ఏఓ వాణి, చేగొమ్మ సొసైటీ కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

గీతకార్మికులకు

సేఫ్టీ కిట్లు పంపిణీ

సత్తుపల్లి: సత్తుపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాలకు కల్లుగీత కార్మికులకు గురువారం కాటమయ్య రక్ష సేఫ్టీ కిట్లు పంపిణీ చేశారు. బీసీ సంక్షేమ శాఖ, ఎకై ్సజ్‌ శాఖల ఆధ్వర్యాన సత్తుపల్లిలో జరిగిన కార్యక్రమంలో డీపీఈఓ నాగేందర్‌రెడ్డి అందజేసి మాట్లాడారు. గీత కార్మికులు వృత్తిలో ప్రమాదాల బారిన పడకుండా ఈ కిట్లు ఉపయోగపడతాయని తెలిపారు. ఎకై ్సజ్‌ సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎస్సై శేఖర్‌, బీసీ సంక్షేమాధికారి బజ్జూరి వెంకటేశ్వరరావు, గౌడసంఘం జిల్లా అధ్యక్షుడు రావుల గోపీగౌడ్‌తో పాటు మొక్కా తిరుపతిరావు, సున్నం నరసింహారావు, రామకృష్ణ, వెంకటేశ్వర్లు, రాఘవ, మల్లయ్య, ఆదినారాయణ, రామారావు, శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు.

రెడ్‌క్రాస్‌లో సభ్యత్వంతో సేవాభావం

ఖమ్మం మామిళ్లగూడెం: మానవ సేవే మాధవసేవ అన్న భావనతో ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సంస్థ చేపడుతున్న కార్యక్రమాల్లో పాలుపంచుకునేలా సభ్యత్వం తీసుకోవాలని జిల్లా కార్మిక శాఖ ఉప కమిషనర్‌ కె.విజయభాస్కర్‌రెడ్డి సూచించారు. సీపీఓ శ్రీనివాస్‌, జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్‌.మాదవి, ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ వైస్‌ చైర్మన్‌ ఆర్‌.రవీందర్‌రావుతో కలిసి గురువారం కలెక్టరేట్‌లో సభ్యత్వ నమోదును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు రెడ్‌క్రాస్‌లో సభ్యత్వం తీసుకుని సేవా కార్యక్రమాల్లో భాగం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుదిమళ్ల సూర్యప్రకాశ్‌రావు, కె.సత్యనారాయణరెడ్డి, ఏ.స్పందన, ఉప్పలయ్య, నర్సయ్య, తాతా రాఘవయ్య, సుధాకర్‌, షకీల్‌ అహ్మద్‌ పాల్గొన్నారు.

శిశుగృహలో న్యాయమూర్తి

ఖమ్మం లీగల్‌: ఖమ్మంలోని శిశుగృహను జిల్లా న్యాయ సేవాసంస్థ కార్యదర్శి పి.దేవీమానస గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల సంక్షేమం, వారికి అందుతున్న వసతులపై వివరాలు తెలుసుకున్నారు. అలాగే, పిల్లలతో మాట్లాడి చదువు, ఆరోగ్యంపై ఆరా తీశారు. కష్టపడి చదువుకుని ఉన్నతస్థాయికి చేరాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ విష్ణువందన తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement