ఖమ్మంసహకారనగర్: భవిత కేంద్రాలు ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు భరోసాగా నిలుస్తున్నాయని జిల్లా విద్యాశాఖ కమ్యూనిటీ మొబిలైజింగ్ ఆఫీసర్(సీఎంఓ) బాజోజు ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల సందర్భంగా గురువారం ఆయన ఖమ్మం నయాబజార్‌లోని భవితా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఐఈఆర్‌పీలు, ఫిజియోథెరపిస్టులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కోసం నిష్ణాతులైన సిబ్బందిని నియమించినందున చికిత్స, బోధనపై దృష్టి సారించాలని తెలిపారు. ఉన్నతాధికారుల చొరవతో నూతన భవనాలు, వసతులు, బోధన ఉపకరణాలు సమకూరుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐఈఆర్‌పీలు సుభద్ర, రామ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.


