● హాజరుకానున్న 2వేల మందికి పైగా విద్యార్థులు
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో ఎప్‌సెట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 4వ తేదీ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఎప్‌సెట్ జరగనుంది. జేఎన్టీయూ ఆధ్వర్యాన ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్ష నిర్వంచనున్నారు. జిల్లా కేంద్రంలో ఫార్మసీ అండ్ అగ్రికల్చరల్ పరీక్ష నిర్వహణకు ఏడు కేంద్రాలను ఏర్పాటు చేయగా 5,725 మంది విద్యార్థులు హాజరవుతారు. అలాగే, ఇంజనీరింగ్ ప్రవేశపరీక్షకు ఎనిమిది కేంద్రాల్లో 12,174 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈనెల 4, 5వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశపరీక్షలు ఉదయం 9నుంచి 12 గంటల వరకు జరగనుండగా 8–30గంటల వరకే అనుమతిస్తారు. ఇక మధ్యాహ్నం 3నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరిగే రెండో సెషన్ పరీక్షలకు 2–30గంటల వరకు అనుమతించనున్నారు. ఇక ఈనెల 9నుంచి 11వ తేదీ వరకు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు రెండేసి సెషన్లలో జరుగుతాయి. కాగా, సత్తుపల్లిలో కూడా రెండు కేంద్రాలు ఏర్పాటుచేయగా ఇంజనీరింగ్ పరీక్షకు 3వేల మంది, అగ్రికల్చర్, ఫార్మసీకి పరీక్షకు 1,005మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
6న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
ఖమ్మం స్పోర్ట్స్: జిల్లాస్థాయి అథ్లెటిక్స్ జట్ల ఎంపికకు ఈనెల 6వ తేదీన పోటీలు నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎం.డీ.షఫీక్ అహ్మద్ తెలిపారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో బుధవారం ఈ పోటీలు జరుగుతాయని వెల్లడించారు. ఇక్కడ ఎంపిక చేసే అండర్–8, 10, 12, 14, 16, 18, 20, సీనియర్ మహిళలు, పురుషుల జట్లు త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు వయసు ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 9గంటలకు రిపోర్టు చేయాలని సూచించారు.
రామయ్యకు
సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి చిత్రకూట మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.
వైభవంగా గోదావరి నదీ హారతి
భద్రాచలంటౌన్: భద్రాచలంలో ఆదివారం సాయంత్రం గోదావరికి నదీ హారతి సమర్పించారు. భద్రాద్రి బ్రాహ్మణ పురోహిత సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గణపతి పూజతో ప్రారంభించి, 108 ప్రమిదలతో దీపోత్సవం, అష్టోత్తర శతనామార్చన, శ్రీరామ నామ భజనలు గావించారు. అనంతరం మంత్రోచ్ఛరణల మధ్య గోదావరి మాత, స్వామికి హారతులు సమర్పించారు.
అప్రమత్తంగా ఉండాలి..
● అకాల వర్షాల నేపథ్యాన కలెక్టర్ సమీక్ష
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో ఆదివారం అకాల వర్షం కురవగా.. సోమ, మంగళవారాల్లో కూడా వర్షసూచనలు ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండేలా అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. ఆయన ఆదివారం రాత్రి మొక్కజొన్నలు, ధాన్యం కొనుగోళ్లపై అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి వివిధ శాఖల అధికారులతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు మక్క కొనుగోలు కేంద్రాలకు గన్నీ బ్యాగులతో వస్తే వాటికీ ప్రభుత్వం చెల్లింపులు చేస్తుందన్నారు. అయితే, కేంద్రాల్లో తడిసిన మక్కలను ఆరబెట్టాకే లోడ్ చేయాలని సూచించారు. కొణిజర్ల, చింతకాని, మద్దులపల్లి ప్రాంతాల్లో నిల్వలు ఎక్కువగా ఉన్నందున త్వరగా గోదాంలకు తరలించాలని తెలిపారు. అంతేకాక మార్క్‌ఫెడ్ పరిధిలోని కేంద్రాల్లో మక్కలు ఏ మేర తడిసాయో 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని చెప్పారు. కాగా, కేంద్రాల్లో నిల్వ ఉన్న మొక్కజొన్నలు, ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచి సరిపడా వాహనాలు, హమాలీలను సమకూర్చుకోవాలని తెలిపారు. అలాగే, కూసుమంచి మండలంలో తడిసిన ధాన్యాన్ని లారీల ద్వారా బాయిల్డ్ రైస్ మిల్లర్లకు తరలించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో మార్క్‌ఫెడ్, పౌరసరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.


