అకాల వర్షంతో ఆగమాగం | - | Sakshi
Sakshi News home page

అకాల వర్షంతో ఆగమాగం

May 4 2026 7:25 AM | Updated on May 4 2026 7:25 AM

● జిల్లాలో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వాన ● కల్లాల్లో తడిసిన మొక్కజొన్నలు ● వరికి నష్టం.. రాలిన మామిడికాయ

● జిల్లాలో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వాన ● కల్లాల్లో తడిసిన మొక్కజొన్నలు ● వరికి నష్టం.. రాలిన మామిడికాయ

ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో ఆదివారం సాయంత్రం వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. అప్పటివరకు ఎండలు ఉక్కిరిబిక్కిరి చేయగా.. సాయంత్రం ఐదు గంటల నుంచి అంతా మారిపోయింది. ఈదురుగాలులకు తోడు ఉరుములు, మెరుపులతో పాటు పలుచోట్ల వర్షం కురిసింది. జిల్లాలో మూడు రోజులుగా 45 డిగ్రీలను దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, ఈ వర్షంతో ప్రజలకు ఉపశమనం కలిగింది. కానీ రైతులకు మాత్రం తీరని నష్టాన్ని మిగిల్చింది.

పంటలకు ప్రతికూలం

యాసంగిలో సాగు చేసిన పంటలు చేతికందుతున్న వేళ ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో రైతులకు నష్టం ఎదురైంది. మొక్కజొన్న కోతలు దాదాపు పూర్తి కాగా, వరి కోతలు జోరుగా సాగుతున్నాయి. పాలేరు, మధిర, వైరా ప్రాంతాల్లో వరి కోత దశలో ఉంది. ఈక్రమాన ఈదురుగాలులతో పంట నేలవాలడమే కాక గింజ రాలింది. అంతేకాక పలుచోట్ల కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన మొక్కజొన్న, వరి ధాన్యం తడిసిపోయాయి. అలాగే, జిల్లాలో దాదాపు 30 వేల ఎకరాల్లో సాగవుతున్న మామిడికి కూడా నష్టం వాటిల్లింది. ప్రస్తుతం మామిడి కోత దశలో ఉండడంతో ఈదురుగాలుల వల్ల కాయ నేలపాలైంది. కాగా, అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యాన రైతులు అప్రమత్తంగా ఉంటూ, పంటలను రాశులుగా చేసుకుని రక్షించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య సూచించారు.

ఫ్లెక్సీలతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో ఆదివారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ మేరకు రహదారులు, విద్యుత్‌ లైన్ల వెంట, భవనాలపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తెగిపోయి విద్యుత్‌ లైన్లపై పడ్డాయి. దీంతో తరచూ ట్రిప్‌ అవుతూ సరఫరాకు అంతరాయం ఎదురైంది. ఖమ్మంలోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు విద్యుత్‌ లైన్లపై పడడంతో సరఫరా నిలిచిపోయింది. దీంతో నగర ఏడీఈ సీహెచ్‌ నాగార్జున పర్యవేక్షణలో సిబ్బంది రంగంలోకి దిగి ఫ్లెక్సీలను తొలగించి సరఫరా పునరుద్ధరించారు. ఏ శాఖ నియంత్రణ లేక అనధికారికంగా వందల సంఖ్యలో ఫ్లెక్సీలు కడుతుండడంతో ఈ పరిస్థితి ఎదురైంది.

Advertisement
 
Advertisement
Advertisement