కృతజ్ఞతలు ఎవరికి తెలపాలి? | - | Sakshi
Sakshi News home page

కృతజ్ఞతలు ఎవరికి తెలపాలి?

May 4 2026 7:25 AM | Updated on May 4 2026 7:25 AM

సత్తుపల్లిటౌన్‌: అశోక్‌ ఇంట్లో దిగులుగా కూర్చున్నాడు. ఆయన భార్య అభిక ఏమిటని ఆరా తీస్తే అశోక్‌ ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. ‘పొద్దున్నే బజారుకు వెళ్లగా నడవలేని ముసలమ్మను బండి ఎక్కించుకున్నా.. ఎక్కడికి వెళ్లాలి అడిగితే పది కిలోమీటర్ల దూరాన గ్రామంలో ఆమె కుమారుడు ఉంటాడని చెబితే అక్కడే దింపాను. ఆ వెంటనే ఇంట్లోకి వెళ్లింది తప్ప నాకు కనీసం కృతజ్ఞతలు చెప్పలే’ అని వెల్లడించాడు. కృతజ్ఞతలు చెప్పించుకోవడం ఇష్టమైన అశోక్‌.. అడిగిన, అడగని వారికి సాయం చేస్తుంటాడు. ఎవరైనా కృతజ్ఞతలు చెబితే సంతోషిస్తాడు. చెప్పకపోతే దిగాలు పడతాడు. భర్త దిగులుకు గల కారణం తెలుసుకున్న అంబిక ‘ఓస్‌ ఇంతేనా.. దీనికే దిగులు పడిపోతారా? మనం సాయం చేసిన ప్రతిఒక్కరూ కృతజ్ఞతలు చెప్పాలని రూలేంలేదు. కొందరు పొరపాటుగా, ఇంకొందరు అలవాటుగానే మర్చిపోతా రు. అలాంటివన్నీ పట్టించుకోకూడదు అని అనున యంగా చెప్పింది’. కానీ అశోక్‌ మాత్రం ‘నాకు సాయం చేసిన చేసిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతాను.. నీకు తెలుసు కదా?’ అన్నాడు. దీనికి అంబిక స్పందిస్తూ ‘ఆ మాటకొస్తే మనం కృతజ్ఞతలు చెప్పాల్సిన వారు ఇద్దరు ఉన్నారు. వాళ్లకెప్పుడైనా చెప్పామా?’ అని అడిగింది. వారెవరని అశోక్‌ ఆరా తీయగా ఆమె సమాధానం చెప్పింది. ‘ఒకరు దేశానికి అన్నం పెడుతున్న రైతు. మరొకరు దేశాన్ని కాపాడుతున్న సైనికుడు. వీరికి ఎప్పుడైనా కృతజ్ఞతలు చెబుతున్నామా?’ అని అడిగింది. ‘నిజమే సుమా! రైతు వ్యవసాయం చేయకపోతే మనకు తిండిలేదు. సైనికుడు సరిహద్దులలో కాపలా కాయకపోతే రక్షణే లేదు’ అన్నాడు అశోక్‌. దీంతో అప్పటి నుంచి అశోక్‌ ఇతరుల నుంచి కృతజ్ఞతలు ఆశించడం మానివేసి ప్రతిరోజు రైతులు, సైనికులకు కృతజ్ఞతలు చెప్పడం అలవాటుగా మార్చుకున్నాడు.

నా పేరు ఆవుల పోతురాజు. సత్తుపల్లికి చెందిన నేను ఇటీవల పదో తరగతి ఉత్తీర్ణత సాధించగా.. వేసవి సెలవుల్లో అమ్మానాన్నలకు పనుల్లో సాయపడుతున్నాను. నాకు కథలు రాయడమంటే చాలా ఇష్టం. పదో తరగతి చదువుతున్నప్పుడు నేను రాసిన కథలతో గార్లపాటి – బొల్లేపల్లి ట్రస్ట్‌ ‘నాన్నే నీ హీరో’ పేరుతో పుస్తకంగా ముద్రించింది. ఈ వేసవి సెలవుల్లోనూ మరికొన్ని కథలు రాస్తున్నాను. అందులో ఒక కథే ఇది.

Advertisement
 
Advertisement
Advertisement