ఎవరెస్టు బేస్‌క్యాంప్‌ వద్దకు జిల్లా యువకుడు | - | Sakshi
Sakshi News home page

ఎవరెస్టు బేస్‌క్యాంప్‌ వద్దకు జిల్లా యువకుడు

May 4 2026 7:25 AM | Updated on May 4 2026 7:25 AM

ఐటీడీఏ పీఓ చిత్రంతో కూడిన

ఫ్లెక్సీ ప్రదర్శన

భద్రాచలం: పెనుబల్లి మండలం వీఎం.బంజరకు చెందిన గిరిజన యువకుడు బి.మోతీకుమార్‌ ఎవరెస్టు శిఖరం బేస్‌ క్యాంప్‌ వద్దకు చేరుకుని సత్తా చాటాడు. అంతేకాక అక్కడ భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్‌ ఫొటోతో కూడిన ఫ్లెక్సీ ప్రదర్శించాడు. గతంలోనూ మోతీకుమార్‌ కిలిమంజారో, ఎలబ్రస్‌ పర్వతాలను అధిరోహించాడు. ప్రస్తుతం సముద్ర మట్టానికి 5,364 మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్‌ పర్వతం బేస్‌క్యాంప్‌ వరకు వెళ్లి వచ్చాడు. గిరిజనుల సంక్షేమం, వారి సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న పీఓ రాహుల్‌పై అభిమానంతో అక్కడ ఆయన చిత్రంతో కూడిన ఫ్లెక్సీ ప్రదర్శించినట్లు వెల్లడించాడు. కాగా, ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు సిద్ధమవుతున్న తనకు దాతలు సహకరించాలని కోరాడు.

176 క్వింటాళ్ల

రేషన్‌ బియ్యం సీజ్‌

ఎర్రుపాలెం: మండలంలోని బనిగండ్లపాడు, పెద్దగోపవరం, మామునూరు గ్రామాల్లో శనివారం అర్ధరాత్రి ఎన్‌ఫోర్స్‌మెంట్‌, సివిల్‌ సప్లయీస్‌ ఓఎస్‌డీ అంజయ్య, డిప్యూటీ తహసీల్దార్‌ ప్రసన్న ఆధ్వర్యాన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురి ఇళ్లలో అక్రమంగా నిల్వ చేసిన 176 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆపై బియ్యాన్ని గోదాంలకు తరలించారు. మామునూరు, పెద్దగోపవరానికి చెందిన లాలా, సుభాని, మల్లికార్జునరావు, తెహరా, లాలుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తనిఖీల్లో ఎస్‌ఐ అజయ్‌కుమార్‌, సిబ్బంది సైదులు, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రమాదవశాత్తు నిప్పు..

కాలిపోయిన పాలిహౌస్‌

కొణిజర్ల: మండలంలోని చిన్నమునగాలలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో శనివారం మంటలు మొదలై మొక్కజొన్న దంటుకు నిప్పంటుకుంది. ఆపై మంటలు అంతకంతకూ పెరుగుతూ సమీపంలోనే ఉన్న మాజీ సర్పంచ్‌ పాపగంటి నాగభూషణం పాలీహౌస్‌కు సైతం అంటుకున్నాయి. దీంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో వైరా నుంచి అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పివేశారు. అప్పటికే పాలీహౌస్‌ పాక్షికంగా కాలిపోగా రూ.2 లక్షల మేర నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపాడు.

Advertisement
 
Advertisement
Advertisement