అగ్నికి ఆహుతైన మొక్కజొన్న పంట | - | Sakshi
Sakshi News home page

అగ్నికి ఆహుతైన మొక్కజొన్న పంట

May 4 2026 7:25 AM | Updated on May 4 2026 7:25 AM

చింతకాని: మండలంలోని పాతర్లపాడులో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 45 మంది రైతులకు చెందిన 600 క్వింటాళ్ల మొక్క జొన్న పంట కాలిబూడిదైంది. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం భారీగా వీచిన ఈదురుగాలులతో మొక్కజొన్న చేన్లలో నిప్పంటుకుని మంటలు వ్యాపించాయి. చేన్లలో కుప్ప పోసిన పంటే కాక కల్లాల్లో కాంటా పూర్తయిన మొక్కజొన్న బస్తాలకు సైతం వ్యాపించి కాలిపోయాయి. అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నించగా ఫలితం లేక గ్రామపంచాయతీ ట్యాంకర్‌ను రప్పించినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. ఘటనలో సుమారు రూ.15 లక్షల నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. కోత పూర్తయిన మొక్కజొన్న చేన్లలో చెత్తకు నిప్పుపెడుతుండడంతో మంటలు వ్యాపిస్తున్నాయని చెబుతున్నారు.

షార్ట్‌ సర్క్యూట్‌తో వరి..

రఘునాథపాలెం: మండలంలోని కోయచలకలో ఆదివారం ఓ రైతుకు చెందిన వరి చేను కాలిపోయింది. గ్రామానికి చెందిన మడుపు బ్రహ్మయ్య రెండెకరాల్లో వరి సాగు చేయగా కోతకు సిద్ధంగా ఉంది. ఈ క్రమాన ఆదివారం విద్యుత్‌ లైన్‌లో ఏర్పడిన షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల నిప్పురవ్వలు పొలంలో పడడం మంటలు వ్యాపించాయి. స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేక కోతకు సిద్ధంగా ఉన్న పంట క్షణాల్లోనే అగ్నికి ఆహుతైంది. ఘటనలో రూ.లక్షకు పైగా నష్టం జరిగిందని రైతు బ్రహ్మయ్య వాపోయాడు.

45 మంది రైతులకు

రూ.15 లక్షల మేర నష్టం

Advertisement
 
Advertisement
Advertisement