ఖమ్మంవైద్యవిభాగం: వైద్య విద్యార్థులు చదువుకే పరిమితం కాకుండా ఎంబీబీఎస్ దశ నుంచే పరిశోధనలపై దృష్టి సారించాలని అదనపు డీఎంఈ, ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ టి.శంకర్ సూచించారు. ఖమ్మం మెడికల్ కాలేజీలో ఆదివారం ఇన్‌స్టిట్యూషనల్ రీసెర్చ్ సెల్(ఐఆర్‌సీ), ఇన్‌స్టిట్యూషనల్ ఎథిక్స్ కమిటీ (ఐఈసీ) సంయుక్త ఆధ్వర్యాన బేసిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషనల్ ఓరియంటేషన్(బ్రియో) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ మాట్లాడుతూ వైద్య రంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవాలంటే పరిశోధనలు కీలకమని పేర్కొన్నారు. విద్యార్థుల్లో పరిశోధనలపై ఆసక్తిని పెంచేందుకు కళాశాలలో ఐఆర్‌సీ, ఐఈసీ విభాగాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ ఓరియంటేషన్‌లో ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట ప్రభుత్వ వైద్య కళాశాలలు, మమత మెడికల్ కాలేజీకి చెందిన 60 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు పాల్గొన్నారు. మహారాష్ట్రలోని ప్రవారా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు చెందిన డాక్టర్ రాహుల్ కుంకులోల్, డాక్టర్ స్వప్నిల్ బోర్సే పలు అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే, వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ ఎస్.రాజేశ్వర్‌రావు, డాక్టర్ సరిత, కోఆర్డినేటర్లు డాక్టర్ వినీల, డాక్టర్ సుగుణ మాట్లాడగా వివిధ విభాగాల బాధ్యులు డాక్టర్ బొలిసెట్టి వేణు, డాక్టర్ వెంకటేశ్వరరావు, డాక్టర్ రాధాకృష్ణ శిక్షణ ఇచ్చారు.
‘బ్రియో’లో నాలుగు కాలేజీల విద్యార్థులు


