●మే డే వేడుకల్లో అదనపు కలెక్టర్ శ్రీజ
ఖమ్మంమయూరిసెంటర్: కార్మికుల హక్కుల పరిరక్షణకు ప్రతిఒక్కరూ కట్టుబడి ఉండాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన మే డే వేడుకల్లో ఆమె మాట్లాడు తూ జిల్లా కమ్యూనిస్టు భావజాలానికి నిలయంగా ఉండి అనేక మంది నాయకులను అందించిందని తెలిపారు. కార్మిక రంగంలో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉన్నందున, సంఘాల్లోనూ చురుగ్గా పాల్గొనాల్సిన అవసరముందని చెప్పారు. కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలులో ఉన్నందున సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు అర్హులకు పథకాలు అందేలా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. గత ఏడాదిలో కార్మిక శాఖ ద్వారా 7,498 మంది కార్మికులకు రూ.35.38కోట్ల సాయం అదనపు కలెక్టర్ వెల్ల డించారు. అనంతరం 2025–26 సంవత్సరాని కి సంబంధించి కార్మికశాఖ అమలుచేసిన కార్యక్రమాల వివరాలతో రూపొందించిన బుక్‌లెట్‌ను ఆమె ఆవిష్కరించారు. ఉప కార్మిక శాఖ కమిషనర్ కె.విజయభాస్కరరెడ్డి, జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.మాధవి, ఉద్యోగులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ–కేవైసీ పూర్తయిన కూలీలకే పనుల కల్పన
ఖమ్మంమయూరిసెంటర్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈ–కేవైసీ చేయించుకున్న కూలీలకు పని కల్పించనున్నట్లు డీఆర్‌డీఓ కె.శ్రీరామ్ తెలిపారు. ఈమేరకు కూలీలంతా ఈ–కేవైసీ పూర్తిచేయించుకోవాలని సూచించారు. జిల్లాలో ప్రస్తుతం రోజుకు 26వేల మంది కూలీలు పనులకు హాజరవుతున్నారని, గతనెల 15వ తేదీ వరకు చేసిన పని దినాలకు సంబంధించి వేతనాలు విడుదలయ్యాయని వెల్లడించారు. కాగా, ఉద్యానవన పంటలు సాగు చేసే రైతుల కు ఉపాధి హామీ పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తూ మామిడి, జామ, నిమ్మ, ఆయిల్ పామ్, డ్రాగన్ ఫ్రూట్, వెదురు, జీడి మామిడి, మునగ, కొబ్బరి, సీతాఫలం సాగును ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. ఈ పథకానికి ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులు అర్హులని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.
‘ఎర్లీ బర్డ్’ గడువు
పొడిగింపు
ఖమ్మంమయూరిసెంటర్: 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను ముందస్తుగా చెల్లించే వారికి రాయితీ కల్పిస్తూ తీసుకొచ్చి న ఎర్లీ బర్డ్ పథకం గడువును ప్రభుత్వం పొడిగించింది. గురువారంతోనే గడువు ముగియగా, ఐదు శాతం రాయితీతో పన్ను చెల్లించేందుకు ఈనెల 7వ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు తెలిసింది. ఈవిషయమై స్పష్టమైన ఆదేశాలు రాకున్నా శుక్రవారం కూడా సైట్ తెరుచుకోవడంతో పలువురు సొంతంగా ఆన్‌లైన్‌లో, మరికొందరు కేఎంసీ కార్యాలయంలో పన్నులు చెల్లించారు. దీంతో గత ఏడాది మాదిరిగానే గడువు పొడిగించినట్లేనని భావిస్తున్నారు. తద్వారా ఖమ్మం కార్పొరేషన్, జిల్లాలోని మున్సిపాలిటీలకు ముందస్తుగా మరింత ఆదాయం సమకూరనుంది.
4నుంచి వ్యవసాయ ప్రత్యేక కార్యక్రమాలు
ఖమ్మం సహకారనగర్: ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఈనెల 4 నుంచి వ్యవసాయ ప్రత్యేక కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. మరో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుతో కలిసి శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రజాపాలన కార్యక్రమాలపై తుమ్మల సూచనలు చేశాక పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. ధాన్యం అమ్మిన రైతులకు 48 గంటల్లో చెల్లింపులు జరిగేలా చూడాలని ఆదేశించారు. జిల్లా నుంచి కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడగా అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
డీఆర్‌ఓగా రాజేశ్వరి
ఖమ్మం సహకారనగర్: జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్‌ఓ)గా ఎం.రాజేశ్వరికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఆమె స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వర్త్తిస్తున్నారు. అయితే, డీఆర్‌ఓగా ఉన్న పద్మశ్రీ గురువారం ఉద్యోగ విరమణ చేశారు. దీంతో డీఆర్‌ఓగా రాజేశ్వరికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ దివాకర శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.


