కార్మిక హక్కులపై కేంద్రం కగార్‌ కత్తి | - | Sakshi
Sakshi News home page

కార్మిక హక్కులపై కేంద్రం కగార్‌ కత్తి

May 2 2026 8:26 AM | Updated on May 2 2026 8:26 AM

● మోదీ కోసమే కమ్యూనిజాన్ని తిడుతున్న చంద్రబాబు ● సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ

● మోదీ కోసమే కమ్యూనిజాన్ని తిడుతున్న చంద్రబాబు ● సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ

ఖమ్మంమయూరిసెంటర్‌: రక్తపు మడుగుల నుంచి పుట్టి ఎనిమిది గంటల పని విధానాన్ని సాధించిన ఎరజ్రెండా ఉనికిని దెబ్బతీసేలా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీపీఐ జాతీయ కంట్రోల్‌ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ కె.నారాయణ ధ్వజమెత్తారు. ఖమ్మంలో శుక్రవారం నిర్వహించిన మే డే ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు. బ్రిటీష్‌ కాలంలో సాధించుకున్న హక్కులు, పని గంటల చట్టాలను కేంద్రం తుంగలో తొక్కుతోందని మండిపడ్డారు. ఐటీ ఉద్యోగులతో వర్క్‌ ఫ్రం హోం పేరిట 20–22 గంటల పనిచేయిస్తూ క్లాసిఫైడ్‌ బానిసలుగా మార్చారని పేర్కొన్నారు. మరోపక్క అడవి బిడ్డలను ఖాళీ చేయించి, సహజ సంపదను కార్పొరేట్ల కు కట్టబెట్టడమే లక్ష్యంగా కేంద్రం ఆపరేషన్‌ కగార్‌ చేపట్టిందని ఆరోపించారు. మావోయిజం పేరుతో గిరిజనులను వేధిస్తున్నా.. సిద్ధాంతాన్ని మాత్రం తుపాకులతో అణచలేరన్నారు. కాగా, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకునేందుకు కమ్యూనిజాన్ని తిడుతున్నారని, ఇది కొంగ జపం లాంటిదేనని నారాయణ ఎద్దేవా చేశారు. కొడుక్కి రాజ్యం అప్పగించి బాబు ప్రధానమంత్రి కావాలని అనుకుంటుండగా, ఆయన ఎంత కాకా పట్టినా మోదీ దగ్గరకు రానివ్వడన్నారు. బీజేపీకి అనుకూలంగా ఉంటే ఎంతటి నేరగాడైనా గంగి గోవులా కనిపిస్తాడని, వ్యతిరేకిస్తే జైలులో పెడతారని దుయ్యబట్టారు. ఇక కేసీఆర్‌ అహంభావం, కుటుంబ పాలనతోనే బీఆర్‌ఎస్‌ సంక్షోభంలో పడిందని తెలిపారు. కేబినెట్‌లో తెలంగాణ ద్రోహులకు చోటు కల్పించి సెంటిమెంట్‌ను కేసీఆరే దెబ్బతీశారన్నారు. సొంత కూతురే తండ్రిని విమర్శించే స్థాయికి వారి కుటుంబ కలహాలు చేరాయని పేర్కొన్నారు. దేశంలో దారిద్య్రం లేని ఏకైక రాష్ట్రంగా కేరళ నిలవడానికి లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రభుత్వ ఘనతేనని నారాయణ కొనియాడారు. సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి దండి సురేశ్‌, నాయకులు మహమ్మద్‌ మౌలానా, జమ్ముల జితేందర్‌రెడ్డి, జానీమియా, శింగు నర్సింహారావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement