● ఖమ్మంలో టీఎల్‌ఎఫ్ ఆధ్వర్యాన పెట్రోల్ బంక్ ● ఐఓసీఎల్ సహకారంతో ఏర్పాటు
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగరంలోని పొదుపు సంఘాల మహిళలు వ్యాపారంలోకి అడుగుపెట్టనున్నారు. టౌన్ లేవల్ ఫెడరేషన్(టీఎల్‌ఎఫ్) ఆధ్వర్యాన పెట్రోల్ బంక్ ఏర్పాటుకు అధికారులు నిర్ణయించారు. తద్వారా మహిళా సంఘాల సభ్యులకు ఆర్థికంగా మరింత పటిష్టత చేకూరనుంది. మహిళా సంఘాలకు పెట్రోల్ బంక్ నిర్వహణ బాధ్యతలను అప్పగించనుండగా.. మొదటగా ఖమ్మంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) సహకారంతో ఏర్పాటుకు ప్రణాళిక ఖరారైంది.
స్థలం ఎంపిక పూర్తి
టీఎల్‌ఎఫ్ ఆధ్వర్యాన బంక్ ఏర్పాటుకు ఇప్పటికే స్థలాన్ని ఎంపిక చేశారు. ఖమ్మం బైపాస్ రోడ్డులోని కొత్త బస్టాండ్ సమీపాన గతంలో హరిత హోటల్ నిర్మాణానికి స్థలం కేటాయించారు. ప్రస్తుతం దాన్ని రద్దు చేసి అక్కడే బంక్ నిర్మాణానికి అధికారులు అనుమతి మంజూరు చేశారు. ఇప్పటికే ఎన్‌ఓసీ కూడా రావడంతో రెండు రోజుల్లో నిర్మాణ పనులకు భూమి పూజ చేసే అవకాశముంది.
అందరూ అతివలే...
ఖమ్మం నగర మహిళా సంఘాల ప్రతినిధుల ఆధ్వర్యాన బంక్ ఏర్పాటు చేస్తుండగా నిర్వహణ బాధ్యతలు సైతం వారికే అప్పగిస్తారు. నిర్వహణ మొదలు సిబ్బంది వరకు అందరూ మహిళలనే నియమిస్తారు. బంక్ నిర్వహణ ద్వారా వచ్చే లాభాలు టీఎల్‌ఎఫ్ ఖాతాలోకి చేరనున్నందున సంఘాల బలోపేతానికి మార్గం ఏర్పడనుంది.
కేఎంసీ సహకారం
మహిళా సంఘాల ఆధ్వర్యాన ఏర్పాటు చేసే బంక్ నిర్మాణం ఐఓసీఎల్ చేపడుతుండగా.. నిర్వహణకు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ సహకరించనుంది. అవసరమైన నిధులను కేఎంసీ ద్వారా సర్దుబాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. కేఎంసీ పరిధిలోని మహిళా సంఘాల సభ్యులు ఇప్పటికే పలు రంగాల్లో రాణిస్తుండగా, ప్రస్తుతం పెట్రోల్ బంక్ నిర్వహణ బాధ్యతలతో వారిలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచనుంది. మెప్మా అధికారులు ఏర్పాట్ల్లలో నిమగ్నం కాగా, ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే రాష్ట్రంలోనే ఖమ్మం టీఎల్‌ఎఫ్‌కు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.


