మొక్కజొన్న కొనుగోళ్లలో మరింత వేగం | - | Sakshi
Sakshi News home page

మొక్కజొన్న కొనుగోళ్లలో మరింత వేగం

May 2 2026 8:26 AM | Updated on May 2 2026 8:26 AM

● రైతులెవరూ ఆందోళన చెందొద్దు ● పలుచోట్ల కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌ దివాకర

● రైతులెవరూ ఆందోళన చెందొద్దు ● పలుచోట్ల కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌ దివాకర

ఖమ్మంరూరల్‌: మొక్కజొన్న కొనుగోళ్లలో మరింత వేగం పెరిగేలా అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. ఆదేశించారు. జిల్లాలోని పలు కొనుగోలు కేంద్రాలను శుక్రవారం పరిశీలించిన ఆయన అధికారులకు సూచనలు చేయడమే కాక రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి మద్దులపల్లి మార్కెట్‌ యార్డులోని కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రవాణా, హమాలీ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. వాతావరణంలో మార్పులు వస్తున్నందున నాణ్యమైన మొక్కజొన్నలను మద్దతు ధరతో రెండు, మూడు రోజుల్లో కొనుగోలు చేయాలని ఆదేశించారు. అలాగే, గన్నీ బ్యాగులు, టార్పాలిన్‌ కవర్లు సమకూర్చుకోవాలని తెలిపారు. రైతులకు ఇబ్బంది రానివ్వం.

మధిర/చింతకాని: మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేసినందున రైతులు ఆందోళనకు గురికావొద్దని కలెక్టర్‌ దివాకర టీఎస్‌ తెలిపారు. మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లు, రవాణా సమస్యలపై మధిర మార్కెట్‌ చైర్మన్‌ బండారు నరసింహారావు ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లగా ఆయన సూచనలతో కలెక్టర్‌ మధిర మార్కెట్‌లో గోదాంలను పరిశీలించి మాట్లాడారు. గోదాంల్లోకి మొక్కజొన్నలు తరలించేందుకు అనుమతి ఇవ్వాలని మార్కెట్‌ చైర్మన్‌ చేసిన వినతికి సానుకూలంగా స్పందించారు. అలాగే, చింతకాని మండలం నాగులవంచలో కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌ మాట్లాడుతూ మొక్కజొన్న కొనుగోళ్లు వేగంగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈకార్యక్రమాల్లో జిల్లా మార్కెటింగ్‌ శాఖాధికారి అలీమ్‌, మార్క్‌ఫెడ్‌ డీఎం శ్యామ్‌కుమార్‌, మద్దులపల్లి మార్కెట్‌ చైర్మన్‌ భైరు హరినాధ్‌బాబు, ఏదులాపురం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అనిత, వైస్‌చైర్మన్‌ తమ్మినేని నవీన్‌, కమిషనర్‌ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్లు ఆర్‌.రాంబాబు, బాబ్జీప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement