ముందస్తు ఆదాయం భళా ! | - | Sakshi
Sakshi News home page

ముందస్తు ఆదాయం భళా !

May 2 2026 8:26 AM | Updated on May 2 2026 8:26 AM

‘ఎర్లీ బర్డ్‌’లో సత్తుపల్లి ముందంజ

రూ.1.58 కోట్లు చెల్లించిన 2,101 మంది

కల్లూరులో 171 మందే చెల్లింపు

ప్రజల సహకారంతో..

సత్తుపల్లిటౌన్‌: మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను ముందస్తుగా రాబట్టేందుకు రాష్ట్ర పురపాలక శాఖ అమలు చేసిన ఎర్లీబర్డ్‌ పథకానికి ఆశించిన స్థాయిలో కాకున్నా మంచి స్పందనే లభించింది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు గాను సత్తుపల్లిలో 24.73 శాతం పన్నులు వసూలు కావడంతో ముందంజలో నిలిచింది. ఇక కల్లూరు మున్సిపాలిటీలో కేవలం 8.16 శాతం పన్నులే వసూలయ్యాయి. ఎర్లీ బర్డ్‌ ద్వారా పన్ను చెల్లించే గడువు ఏప్రిల్‌ 30వ తేదీతో ముగియగా, గత ఏడాది మాదిరి మరో వారం పొడిగించినట్లు తెలిసింది. ఈ మేరకు శుక్రవారం కూడా సైట్‌ తెరుచుకున్నందున పొడిగింపు నిజమేనని చెబుతుండగా.. గడువు ముగిసేలోగా ఆస్తిపన్ను రూపంలో మున్సిపాలిటీలకు మరింత ఆదాయం సమకూరనుంది.

ఐదు శాతం రాయితీ

ముందుగా ఆస్తి పన్ను చెల్లిస్తే ఐదు శాతం రాయితీ వర్తింపజేశారు. ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను మొత్తంగా చెల్లిస్తే రాయితీ లభిస్తుందనే అంశంపై మున్సిపాలిటీల అధికారులు ఫ్లెక్సీలు, మైకుల ద్వారా విస్తృత ప్రచారం చేశారు. ఈ మేరకు పలువురు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. అయితే, జనాభా గణనకు కుటుంబాలు, బ్లాక్‌ల నిర్వహణలో బిల్‌కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లు నిమగ్నం కావడంతో ప్రచారంపై పెద్దగా దృష్టి సారించలేకపోయారు. లేనిపక్షంలో వసూళ్లు మరింత పెరిగేవని చెబుతున్నారు.

సత్తుపల్లి ఫస్ట్‌

ఎర్లీబర్డ్‌ పథకం అమలులో జిల్లాలోని మున్సిపాలిటీల్లో సత్తుపలి అగ్రస్థానాన నిలిచింది. ఇక్కడ 2,101 మంది రూ.1.58 కోట్ల మేర ఆస్తిపన్ను చెల్లించి ఐదు శాతం రాయితీని సద్వినియోగం చేసుకున్నారు. ఈ మున్సిపాలిటీలో మొత్తం రూ.6.39 కోట్ల ఆస్తి పన్ను డిమాండ్‌ ఉండగా.. 24.73 శాతం పన్ను ఆర్థిక సంవత్సరం మొదటి నెలలోనే వసూలైంది. ఇక మధిర 14.60 శాతం, వైరా 16.48 శాతం, కల్లూరు 11.70 శాతం, ఏదులాపురం 8.16 శాతం మాత్రమే ముందస్తు ఆదాయం సమకూరింది.

మున్సిపాలిటీ పన్ను డిమాండ్‌ చెల్లించిన ఇళ్లు వసూలైన పన్ను

సత్తుపల్లి రూ.6.39 కోట్లు 2,101 రూ.1.58 కోట్లు

మధిర రూ.4.59 కోట్లు 1,779 రూ.0.67 లక్షలు

వైరా రూ.5.46కోట్లు 1,141 రూ.0.90 లక్షలు

కల్లూరు రూ.0.94 కోట్లు 171 రూ.0.11 లక్షలు

ఏదులాపురం రూ.8.59 కోట్లు 2,068 రూ.0.70 లక్షలు

ఎర్లీ బర్డ్‌పై విస్తృత ప్రచారం చేశాం. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్ల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాం. దీంతో మున్సిపల్‌ పరిధిలోని పలువురు ఐదు శాతం రాయితీని సద్వినియోగం చేసుకుంటూ పన్ను చెల్లించారు. ఈ నిధులతో పట్టణంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీలు ఏర్పడుతుంది. –కె.నర్సింహ, కమిషనర్‌, సత్తుపల్లి

Advertisement
 
Advertisement
Advertisement