ఖమ్మంసహకారనగర్: రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకు జీపీఎఫ్ బకాయిలు చెల్లించిందనే ప్రచారంలో వాస్తవం లేదని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్‌డ్ పెన్షనర్స్ అసోసియేషన్ (పీఆర్‌పీఏ) జిల్లా కన్వీనర్ యలమద్ది వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఖమ్మంలోని పీఆర్‌టీయూ భవన్‌లో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్టోబర్ 2025 వరకు రిటైర్డ్ అయిన ఉద్యోగుల్లో కేవలం ప్రభుత్వ మేనేజ్‌మెంట్‌లోని ఉపాధ్యాయులకే జీపీఎఫ్ బకాయిలు జమ చేశారని తెలిపారు. జిల్లా పరిషత్ పరిధి ఉపాధ్యాయుయులకు చెల్లింపులు జరగలేదని పేర్కొన్నారు. ఇకనైనా ప్రభుత్వం వివక్ష విడనాడి అందరికీ ఏకమొత్తంగా బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు కందుల వెంకటనరసయ్య, పి.కొండల్‌రావు, రాజు, లక్ష్మణ్‌రావు, కొత్త శ్రీనివాసరావు, ఎం.సీతారామయ్య, జీఎస్ నారాయణ, జి.వీరయ్య, ఆర్.సుమతి తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా లక్ష్మీనర్సింహస్వామి కల్యాణం
ఏన్కూరు: ఏన్కూరు మండలం గార్లఒడ్డులో శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో స్వామి వారి కల్యాణాన్ని శుక్రవారం రాత్రి జరిగింది. గతనెల 29 నుంచి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాలచార్యులు, నాగరాజు ఆచార్యులుతో పాటు వివిధ ప్రాంతాల భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
రిటైర్డ్ పోలీసు
ఉద్యోగులకు సన్మానం
ఖమ్మంక్రైం: పోలీసు శాఖలో విధులు నిర్వర్తించిన పలువురు ఉద్యోగులు, హోంగార్డులు గురువారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా వీరిని పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ శుక్రవారం సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఉద్యోగ విరమణ చేసిన వారిలో ఎస్‌ఐలు నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు, వేణుగోపాల్‌రెడ్డి, శ్రీనివాసరావు, ఏఎస్‌ఐలు ఆర్‌వీవీ బ్రహ్మచారి, సత్యనారాయణ, హెడ్‌కానిస్టేబుల్ యాసిన్‌మియా, హోంగార్డులు లోకమ్మ, వీరస్వామి ఉన్నారు.
రిటైర్డ్ ఉద్యోగి చికిత్సకు చేయూత
ఖమ్మంక్రైం: ఎస్‌ఐగా విధులు నిర్వర్తించిన ఉద్యోగ విరమణ చేసిన మౌలానా అనారోగ్యంతో బాధపడుతుండగా పలువురు అండగా నిలిచారు. ఈమేరకు వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న పోలీసు ఉద్యోగులు, రిటైర్డ్ అధికారులు ఆయన చికిత్స కోసం రూ.1.50లక్షలను సమకూర్చారు. ఆయనకు ఆర్థికసాయం అందించిన వారిలో పోలీసు అధికారులు చక్రపాణి, శ్రీనివాస్‌రెడ్డి, ఎస్వీ.రమణమూర్తి, శేషుకుమార్, పీ.వీ.గణేష్, మోహన్‌రాజ, నరేష్‌రెడ్డి, సతీష్, వెంకటరావు, బిల్లా అశోక్ తదితరులు ఉన్నారు. వీరికి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రాధాకృష్ణమూర్తి, వెంకటనారాయణ కృతజ్ఞతలు తెలిపారు.
ప్లాట్ పేరుతో మోసంపై కేసు నమోదు
రఘునాథపాలెం: మండలంలోని జింకలతండా వద్ద ప్లాట్‌లో ఇల్లు నిర్మాణం పేరిట డబ్బు తీసుకుని మోసం చేసిన ఘటనపై శుక్రవారం కేసు నమోదైంది. ఓ వెంచర్‌లోని 130 గజాల ప్లాట్‌లో ఇల్లు నిర్మిస్తామని చెప్పిన వెంచర్ నిర్వాహకుడు జి.ప్రకాష్ రూ.23లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ మేరకు 2022లో రూ.2.30 లక్షలు తీసుకుని ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేయకపోగా ఇంటి నిర్మాణం కూడా చేపట్టడం లేదని, డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని వాసాల అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ప్రకాష్‌పై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు.
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
నేలకొండపల్లి: మండలంలోని ఓ గ్రామంలో బాలికకు వివాహం జరగనుందనే సమాచారంతో అధికారులు అడ్డుకున్నారు. ఇటీవలే పదో తరగతి పూర్తిచేసిన బాలిక (16)కు ఆమె కుటుంబీకులు వివాహం నిర్ణయించి ఈ నెల 8న ముహూర్తం ఖరారు చేశారు. ఈ విషయమై అందిన సమాచారంతో ఏఎస్‌ఐ లతీఫ్ షరీఫ్ తదితరులు శుక్రవారం బాలిక ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. మైనార్టీ తీరకుండా వివాహం చేయడం చట్టరీత్యా నేరమే కాక భవిష్యత్‌లో ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు. ఆపై బాల్యవివాహం చేయబోమని కుటుంబీకుల నుంచి లేఖ తీసుకున్నారు. పంచాయతీ కార్యదర్శి హరీశ్, జీపీఓ జానకీరాములు, అంగన్‌వాడీ టీచర్ కళావతి తదితరులు పాల్గొన్నారు.


