● జిల్లాలోని పలు చోట్ల అగ్నిప్రమాదాలు ● ఘటనల్లో పంటలు, ఆస్తుల దగ్ధం
చింతకాని: మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. బస్వాపురంలో లోయ ఉపేందర్, కుక్కల సైదులు, శ్రీను, ఉస్మాన్‌కు చెందిన మొక్కజొన్న చేన్లకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని నాలుగెకరాల్లో పంట దగ్ధమైంది. అలాగే కోలపాటి నాగరాజు, తూము వెంకట్రామారావుకు చెందిన వరి పంట, అవుకు నర్సింహారావు పామాయిల్ తోటలో కొన్ని చెట్లు, తిమ్మినేనిపాలెంలో సామినేని శ్రీనివాసరావు, అప్పారావు, తుళ్లూరు శ్రీనివాసరావు, ఫరీద్‌కు చెందిన 20 ఎకరాల మామిడి తోటలో చెట్లు, నంజాల మల్లికార్జున్‌రావు, సత్యానికి చెందిన వరి గడ్డివాములు కాలిపోగా, నామారపు సీతారామ్ ఇంటికి నిప్పంటుకుని కొంతమేర కాలిపోయింది. అలాగే, లచ్చగూడెంలో వంకాయలపాటి కృష్ణకు చెందిన పామాయిల్ తోటకు మంటలు అంటుకుని కొన్ని చెట్లు కాలిపోయాయి. చింతకానిలో బోయిన కోటేశ్వరరావు, ఉపేందర్‌కు చెందిన గడ్డివాములు, ఉపేందర్ డబ్బా కొట్టు కాలిపోయింది. ఇక దేశబోయిన వెంకటేశ్వర్లుకు చెందిన ట్రాక్టర్ ఇంజన్ మంటల్లో పూర్తిగా కాలిపోగా తీవ్రనష్టం వాటిల్లింది. నాగిలిగొండ, నర్సింహాపురంలో కూడా ప్రమాదాలు జరగగా, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. పలువురు రైతులు మొక్కజొన్న చెత్తకు నిప్పు పెడుతుండడంతో మంటలు వ్యాపించి సమీప చేన్లలో పంటలకు నష్టం జరుగుతున్నట్లు తెలుస్తోంది.
మధిర/బోనకల్/నేలకొండపలి/ముదిగొండ్ల: మధిర మండలం మాటూరుకు చెందిన దేవిశెట్టి శ్రీనివాసరావు నాలుగెకరాలు కౌలుకు తీసుకొని మొక్కజొన్న సాగు చేశాడు. ఈ చేను పక్కనే సబ్‌స్టేషన్ నిర్మిస్తుండగా, శుక్రవారం వచ్చిన గాలిదుమ్ముకు తీగలు రాసుకుని నిప్పు రావడమే కాక 11 కేవీ విద్యుత్ వైరు తెగి పడటంతో పంటకు నిప్పు అంటుకుంది. దీంతో కళ్లముందే పంట అగ్నికి ఆహుతైందని శ్రీనివాసరావు వాపోయాడు. అయితే, విద్యుత్ లైన్ల నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. బోనకల్ మండలం చిరునోములలో గుర్తుతెలియని వ్యక్తులు మొక్కజొన్న దండుకు నిప్పు పెట్టడంతో షేక్ నజీర్ చేనులోని 10 క్వింటాళ్ల మొక్కజొన్న కంకులు కాలిపోయాయి. అలాగే, మోహన్‌రావు, చింతయ్యకు సంబంధించి ఆయిల్‌పామ్ తోటకు కూడా నిప్పంటుకుని మొక్కలు దగ్ధమయ్యాయి. అలాగే, నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెంలో రైతు గోవింద్‌కు చెందిన మొక్కజొన్న చేనుకు ప్రమాదవశాత్తు నిప్పంటుకుని కంకులు కాలిపోయాయి. అంతేకాక ముదిగొండ మండలంలోని రాఘవాపురం, ముదిగొండల్లో చేన్లలోని పంట వ్యర్థాలకు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని గాలుల తాకిడి మంటలు విస్తరించాయి. కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్నల వైపు మంటలు వస్తుండడంతో అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు చేరుకుని స్థానికులతో కలిసి మంటలు ఆర్పారు.
షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు..
కల్లూరురూరల్: మండలంలోని పాయపూర్‌లో మాదాసు వెంకన్నకు చెందిన ఇంట్లో గురువారం షార్ట్ సర్క్యూట్ ఏర్పడి పూర్తిగా దగ్ధమైంది. గడ్డి ఇల్లు కావడంతో త్వరగా మంటలు అంటుకుని సామగ్రి, నిత్యావసరాలు, బియ్యం కాలి బూడిదయ్యాయి. ఈ సమయాన కుటుంబీకులు ఆరుబయట నిద్రిస్తుండడంతో ప్రమాదం తప్పినట్లయింది.


