కొనసాగిన నిరసనలు.. | - | Sakshi
Sakshi News home page

కొనసాగిన నిరసనలు..

Apr 25 2026 8:00 AM | Updated on Apr 25 2026 8:00 AM

● సూపర్‌వైజర్లు కూడా విధుల బహిష్కరణ ● సంఘీభావం తెలిపిన పార్టీలు, సంఘాల నాయకులు

మూడోరోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె
● సూపర్‌వైజర్లు కూడా విధుల బహిష్కరణ ● సంఘీభావం తెలిపిన పార్టీలు, సంఘాల నాయకులు

ఖమ్మంమయూరిసెంటర్‌: అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం, హామీలు అమలు చేయాలనే డిమాండ్‌తో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మూడో రోజైన శుక్రవారం నిరసనలతో కొనసాగింది. తొలి రెండు రోజులు డిపోగేట్ల వద్ద నిరసనలు తెలిపిన కార్మికులు శుక్రవారం ఖమ్మం పాత బస్టాండ్‌ వద్ద మయూరిసెంటర్‌లో నోటికి నల్ల రిబ్బన్లు ధరించి మానవహారంగా ఏర్పడ్డారు. కాగా, కార్మికుల సమ్మెకు మద్దతుగా రీజియన్‌లోని అన్ని డిపోల అకౌంట్‌, పరిపాలన విభాగాల్లోని సూపర్‌వైజర్లు సైతం విధులు బహిష్కరించారు. దీంతో ఖమ్మం డిపో మేనేజర్‌ కార్యాలయం గేటుకు వేసిన తాళాలు శుక్రవారం తెరుచుకోలేదు.

పార్టీల సంఘీభావం

ఖమ్మం డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల నిరసనకు పలు పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. సీపీఐ, బీజేపీ, న్యూడెమోక్రసీ నాయకులు మద్దతు పలికి సమస్యలు పరిష్కారం అయ్యేవరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకుంటే మరో ఉద్యమం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్మికులు 41 రోజుల క్రితమే సమ్మె నోటీసు ఇచ్చినా ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదన్నారు. కాగా, కార్మికుల సమ్మెతో బస్సులన్నీ నడవకపోగా, నడిచిన బస్సులు కూడా కొద్దిరూట్లలో.. అదీ సమయపాలన లేకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. హైదరాబాద్‌, భద్రాచలం రూట్లలో వెళ్లే ప్రయాణికులు ప్రైవేటు వాహనాలు ఆశ్రయించారు. ఇక సాయంత్రం దాటాక కోదాడ, కొత్తగూడెం, సూర్యాపేట వంటి ప్రధాన రూట్లలో బస్సులు లేక అవస్థ పడుతున్నారు.

బందోబస్తు.. పర్యవేక్షణ

పోలీసులతో పాటు ఆర్టీసీ విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ విభాగ అధికారులు, సిబ్బంది కార్మికుల నిరసనలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కార్మికులు క్షణికావేశానికి లోనుకాకుండా సూచనలు చేస్తున్నారు. సమస్యలు పరిష్కారం అవుతాయని, ఆవేదనకు గురికావొద్దని నిరసన శిబిరాల వద్ద కార్మికులకు నచ్చజెప్పారు. పాత బస్టాండ్‌లో అధికారులు ముందుజాగ్రత్తగా ఓ అంబులెన్స్‌ ఏర్పాటుచేశారు.

రోడ్డెక్కిన 330 బస్సులు

కార్మికులంతా సమ్మెలో ఉండడంతో అధికారులు ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులు, తాత్కాలిక సిబ్బంది, అద్దె బస్సుల డ్రైవర్లతో కొన్ని బస్సులను నడిపారు. రీజియన్‌లో 538 బస్సులకు గాను శుక్రవారం 330 బస్సులు రోడ్డెక్కాయి. తద్వారా 61 శాతం బస్సులను నడిపించామని అధికారులు వెల్లడించారు. అయితే, గురువారంతో పోలిస్తే శుక్రవారం బస్సుల సంఖ్య తగ్గడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement