ఖమ్మంమయూరిసెంటర్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదల చేయగా, జిల్లాలోని సంక్షేమ గురుకుల కళాశాలల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. జిల్లాలోని ఎస్సీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించారు.
ఎస్సీ గురుకులాల విద్యార్థులు
జిల్లాలో 13 సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల నుంచి ప్రథమ సంవత్సరం పరీక్షలకు 827 మంది పరీక్షలకు హాజరు కాగా 682 మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 880 మందికి 814 మంది ఉత్తీర్ణత సాధించారు. దానవాయిగూడెం, కూసుమంచి బాలికల కళాశాలల్లో ద్వితీయ సంవత్సరం నుంచి వంద శాతం ఉత్తీర్ణత సాధించగా, ఖమ్మం అంబేద్కర్ గురుకులంలో ఎంపీసీ ప్రథమ సంవత్సరం విద్యార్థి వి.ప్రదీప్తి 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించింది.
బీసీ గురుకులాల్లో..
బీసీ గురుకులాల విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో ఉత్తమ మార్కులు సాధించారు. ప్రథమ సంవత్సరంలో 647 మందికి 596 మంది, ద్వితీయ సంవత్సరంలో 585 మంది విద్యార్థులకు 557 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. దానవాయిగూడెం బాలికల కళాశాలకు చెందిన ఎం.వర్ష 467, సత్తుపల్లి బాలికల కళాశాలకు చెందిన ఎన్.అఖిల, సీహెచ్.పూజిత 467 మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరంలో కూసుమంచి బాలుర కళాశాలకు చెందిన పి.సాయి వేయి మార్కులకు గాను 992మార్కులు సాధించగా గురుకులాల కార్యదర్శి బి.సైదులు, ఆర్సీఓ సీహెచ్.రాంబాబు, డీసీఓలు, ప్రిన్సిపాళ్లు అభినందించారు.
మైనార్టీ గురుకులాల్లో..
ఇంటర్ ఫలితాల్లో మైనార్టీ గురుకుల విద్యార్థులు ప్రతిభ చాటారు. ఏడు గురుకులాల నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 315మంది హాజరుకాగా, 284మంది(90శాతం) ఉత్తీర్ణులయ్యారు. మధిర, సత్తుపల్లి బాలుర గురుకులాల్లో వందశాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రథమ సంవత్సరంలో 359 మందికి 305 మంది (84.95 శాతం) ఉత్తీర్ణత సాధించారు.
రాష్ట్రస్థాయిలో సత్తా
రఘునాథపాలెం: రఘునాథపాలెంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల ప్రతిభా కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని ప్రిన్సిపాల్ ఎం. బాలస్వామి వెల్లడించారు. జూనియర్ ఎంపీసీలో టి.యుగేందర్ 468, జె.జోషిత్ 467 మార్కులు సాధించారని, 13మంది 450కి పైగా మార్కులు సాధించగా 97శాతం ఉత్తీర్ణత నమోదైందని తెలి పారు. బైపీసీలో ఎం.మహేష్ 433 మార్కులు సాధించగా 92శాతం ఉత్తీర్ణత నమోదైందన్నారు. సీనియర్ బైపీసీలో డి.గణేష్ 991, ఎంపీసీలో కె.నితిన్ 980, బి.జశ్వంత్ 979మార్కులు సాధించారని, వంద శాతం ఉత్తీర్ణత నమోదైందని వివరించారు.
బీసీ, ఎస్సీ గురుకుల విద్యార్థులకు
టాప్ మార్కులు


