వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో రెండు రోజుల పాటు జరిగిన 11వ తెలంగాణ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు ఆదివారం ముగిశాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 552 మంది అథ్లెట్లు 76 ఈవెంట్లలో నువ్వా, నేనా అన్నట్లు తలపడ్డారు. ఈ మేరకు పురుషుల విభాగంలో ఖమ్మం జిల్లా అథ్లెట్లు, మహిళల విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అథ్లెట్లు ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను దక్కించుకున్నారు. ముగింపు వేడుకల్లో విజేతలకు ములుగు డీవైఎస్‌ఓ ఎ.ధరానాయక్ ట్రోఫీలు అందజేశారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి పగడాల వెంకటేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, అసోసియేషన్ చీఫ్ కోచ్ ఎండీ.గౌస్ తదితరులు పాల్గొన్నారు.
నేడు మంత్రి తుమ్మల
పర్యటన
ఖమ్మంఅర్బన్: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఖమ్మం నగరంలో పర్యటించనున్నారు. సాయంత్రం వీడీవోస్ కాలనీలోని టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్‌లో జరిగే సమావేశంలో ముస్లిం మైనార్టీలకు కుట్టుమిషన్లు పంపిణీ చేస్తారు. అలాగే, అంగన్‌వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్లు, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు అందజేయనున్నారు. ఆతర్వాత మహిళా ప్రాంగణంలో డ్రోన్ల నిర్వహణపై శిక్షణ పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్లు పంపిణీ చేయనున్నారు.
భార్య గర్భిణి..
తల్లికి అనారోగ్యం
● చికిత్స కోసం వచ్చిన వ్యక్తిని
రైలు ఢీకొట్టగా మృతి
ఖమ్మంక్రైం: ఖమ్మం గాంధీచౌక్ రైల్వే గేటు వద్ద ఓ వ్యక్తి పట్టాలు దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు ఢీకొనడంతో మృతి చెందాడు. శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరగగా సదరు వ్యక్తి సుమారు 100 మీటర్ల దూరానికి ఎగిరిపడ్డాడు. మృతుడి వద్ద లభించిన సెల్‌ఫోన్ ఆధారంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గాండ్లగూడెంనకు చెందిన హలావత్ ప్రసాద్‌నాయక్(31)గా గుర్తించారు. హైదరాబాద్‌లో కూలీ పనులతో జీవనం సాగిస్తున్న ఆయన అక్కడి మహిళను కులాంతర వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం భార్య నిండు గర్భవతి కాగా, ఆయన తల్లి అనారోగ్యం బారిన పడడంతో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నాడు. ఈ క్రమాన శనివారం అర్ధరాత్రి గాంధీచౌక్‌కు వెళ్తూ పట్టాలు దాటే సమయాన రైలు ఢీకొని మృత్యువాత పడ్డాడు. దీంతో జీఆర్‌పీ పోలీసులు ఇచ్చిన సమాచారంతో అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు, సిబ్బంది చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. జీఆర్‌పీ హెడ్‌కానిస్టేబుల్ ఎం. మురళీకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
గ్రామీణ వైద్యుడి బలవన్మరణం
చింతకాని: మండలంలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన గ్రామీణ వైద్యుడు ముక్తవరపు కృష్ణమూర్తి (62) ఆదివారం తెల్లవారుజామున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన డాబా మెట్ల పైకప్పుకు ఉన్న పైపుకు ప్లాస్టిక్ తాడుతో ఉరి వేసుకున్నాడు. కుమారులు ఉదయం చూడగా అప్పటికే చనిపోయి ఉన్నాడు. ఆయన కుమారుడు అరుణ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వీరేందర్ తెలిపారు.


