ఉదయం నుంచే ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి 40 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతకు తోడు వడగాలులు ముప్పు ఈనెల రెండో వారం తర్వాత తీవ్రత పెరిగే ప్రమాదం
రానున్న రోజుల్లో మరింత..
జిల్లాలో భానుడి భగభగలు మొదలయ్యాయి. కొద్ది రోజులుగా ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతుండగా.. ఉదయం పది గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపుతున్నాడు. ఫలితంగా ఉక్కపోత, వేడిగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈనెల రెండో వారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని, వడగాలుల తీవ్రత మొదలవుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈనేపథ్యాన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం
నిర్మానుష్యంగా మారిన ఖమ్మం ఎన్‌టీఆర్ సర్కిల్ – కొత్త బస్టాండ్ రహదారి
ఈనెల 1వ తేదీ నుంచి జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రతిరోజు 38 – 40 డిగ్రీల సెల్సియస్ మేర గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతోంది. సోమవారం సాయంత్రం 4గంటల వరకు ఎండ ఎక్కువగా ఉన్నా.. 5గంటల తర్వాత వాతావరణం చల్లబడి చిరుజల్లులు కురవడంతో ప్రజలు ఉపశమనం పొందారు. అయితే, మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సూర్యుడు నిప్పులు కురిపించాడు. ఈ వేసవిలో అధిక వేడి ఇదే కావడంతో ప్రధాన రహదారులన్నీ బోసిపోయి కనిపించాయి. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చిన పలువురు ఎండ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
పగటి సమయాన ఎండ వేడితో ఇబ్బంది పడుతుండగా.. రాత్రింబవళ్లు తేడా లేకుండా ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పనుల నిమిత్తం బయటకు వచ్చిన వారు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఫలితంగా చాలామంది ఉదయం 10నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటకు రావడం లేదు. ఉష్ణోగ్రతలు 38 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ లోపే చూపుతున్నా.. ఉక్కపోత కారణంగా ప్రజలు నిస్సత్తువకు గురవుతున్నారు.
ఈ వేసవిలో వాతావరణం చిత్రవిచిత్రంగా మారుతోంది. ఏప్రిల్ రెండోవారం నుంచి మే నెల మొత్తం వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. వడగాలుల నేపథ్యాన ఉదయం 11నుంచి సాయంత్రం 4గంటల వరకు బయటకు రావొద్దని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు వెల్లడించారు. మొత్తంగా రెండు నెలల పాటు ఎండల తీవ్రతకు తోడు వడగాలుల ప్రభావం ఉండనుండడంతో ప్రజలకు అప్రమత్తంగా ఉండక తప్పని పరిస్థితి ఎదురవుతోంది. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తలు పాటించాలని అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు.
జిల్లాలో క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
ఈనెల 10వ తేదీ తర్వాత సాధారణం కన్నా మూడు నాలుగు డిగ్రీలు ఎక్కువగానే ఉష్ణోగ్రత నమోదవుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈమేరకు అప్రమత్తంగా ఉండాలని జిల్లాకు అలర్ట్ ప్రకటించింది. ఈనెల రెండో వారం తర్వాత 40 – 44 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత నమోదవుతుందని, మే నెలలో తీవ్రత మరింతగా ఉంటుందని తెలుస్తోంది.


