రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపిక

Apr 8 2026 7:26 AM | Updated on Apr 8 2026 7:26 AM

ఖమ్మం స్పోర్ట్స్‌: హనుమకొండలో ఈనెల 11, 12వ తేదీల్లో జరగనున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు జిల్లా నుంచి క్రీడాకారులను ఎంపిక చేశారు. ఈమేరకు జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాల మైదానంలో అండర్‌–20, సీనియర్‌ పురుషుల, మహిళల విభాగా ల్లో ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. అండర్‌–20 బాలుర విభాగంలో డి.వివేక్‌చంద్ర, అబ్దుల్‌రజాక్‌, అక్సార్‌, ఏ.గణేష్‌, స్వరూప్‌, బాలికల్లో బి.వైశాలి, ఎం.ప్రసన్నకుమారి, రాజరాజేశ్వరి ఎంపికయ్యారు. ఇక సీని యర్‌ పురుషుల జట్టుకు ప్రసన్నకుమార్‌, కె. శివ, బి.బన్సీలాల్‌, ఎస్‌.కే.మసూద్‌పాషా, ఎస్‌. కే.ఆఫ్తాబ్‌, ఎం.మురళీకృష్ణ, ఎల్‌.విక్రమ్‌, మహిళల విభాగంలో హజీరా ఫాతిమా, ఏ.సుకన్య, అమీనానాజ్‌ ఎంపికయ్యారని తెలిపారు. పోటీలనుఅథ్లెటిక్స్‌ అకాడమీ చీఫ్‌ కోచ్‌ ఎం.డీ. గౌస్‌, ఎం.సుధాకర్‌ తదితరులు పర్యవేక్షించారు.

10నుంచి

డిగ్రీ ప్రాక్టికల్‌ పరీక్షలు

ఖమ్మం సహకారనగర్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో 2016 కంటే ముందు డిగ్రీ చదివి ప్రాక్టికల్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బానోతు రెడ్డి తెలిపారు. తృతీయ సంవత్సరం విద్యార్థులకు ఈనెల 10, 11వ తేదీల్లో, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు 12, 13వ తేదీలలో, ప్రథమ సంవత్సరం వారికి 14, 15వ తేదీల్లో పరీక్షలు ఉంటాయని వెల్లడించారు. ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జరిగే పరీక్షల వివరాల కోసం 91605 38938 నంబర్‌లో సంప్రదించాలని ఆయన ఓ ప్రకటనలో సూచించారు.

గిరిజన మహిళా డిగ్రీ కళాశాలకు రూ.2లక్షలు

కొణిజర్ల: కొణిజర్ల మండలం తనికెళ్లలోని గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో బాలికలకు శిక్షణ కోసం రూ.2లక్షలు కేటాయించారు. ఈమేరకు చెక్కును భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్‌ మంగళవారం అందజేశారు. ఈ కళాశాలలో బాలికలకు బ్యూటీషియన్‌, టైలరింగ్‌, మగ్గం వర్క్‌, పుట్టగొడుగుల పెంపకం, తాటి ఆకులతో బుట్టలు అల్లడమే కాక కాస్మోటిక్స్‌ తయారీపై శిక్షణ ఇస్తున్నారు. అలాగే, పెయింటింగ్‌లో ప్రతిభ చాటుతున్న డిగ్రీ తృతీయ సంవత్సరం విద్యార్థిని ఇర్సా స్వాతికి పీఓ రూ.22,500 నగదు పురస్కారం ఆందజేశారు. ఆమె గతంలో పెయింటింగ్‌లు వేయగా, ఐటీడీఏ మ్యూజియంలో పెట్టేకుందుకు మరికొన్ని పెయింటింగ్స్‌ వేయాలని సూచించారు. వీటిని పూర్తిచేయగా స్వాతిని పీఓ అభినందించారు. గురుకులాల ఉమ్మడి జిల్లా ఆర్‌సీఓ అరుణకుమారి, కళాశాల ప్రిన్సిపాల్‌ రజని పాల్గొన్నారు.

శాస్త్రోక్తంగా

రామయ్య నిత్యకల్యాణం

భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం కనుల పండువగా జరిగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం నిర్వహించారు. ఆతర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. కాగా, మంగళవారం కావడంతో ఆంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement