ఇబ్బంది లేకుండా సరఫరా
● సాగుకు ఢోకా లేకుండా సాగర్ జలాలు.. ● రైతుల వినతులతో గడువు పొడిగింపు?
ఖమ్మంఅర్బన్: జిల్లాలో రబీ పంటల సాగు ఆఖరి దశలో ఉండగా ఇబ్బందులు ఎదురుకాకుండా సాగర్ జలాలు మరికొన్నాళ్లు విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ఈనెల 7వ తేదీతో సరఫరా నిలిపివేయాల్సి ఉంది. అయితే, రైతుల డిమాండ్ దృష్ట్యా మరికొన్నాళ్లు నీటి విడుదల కొనసాగించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించినట్లు సమాచారం. హైదరాబాద్‌లో తాజాగా నిర్వహించిన సమీక్షల్లో ఇంజనీర్ల నుంచి అందిన నివేదికలు, ఆయకట్టులో పంటల సాగుపై చర్చించారు. ఈమేరకు పంటలు ఎండి పోకుండా మరో తడి వరకు నీరు విడుదల చేయడానికి మంత్రి అంగీకరించినట్లు తెలిసింది. దీంతో మరో వారం నుంచి పది రోజుల వరకు సాగర్ జలాలు విడుదలయ్యే అవకాశం ఉంది.
25వేల ఎకరాలకు అవసరం
జిల్లాలోని రైతులు యాసంగిలో సాగర్ ఆయకట్టు కింద 2,54,250 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఇందులో 90 శాతం పంటలకు నీటి అవసరం తీరింది. అయినా దాదాపు 25వేల ఎకరాలకు నీటి అవసరం ఉన్నట్లు అధికారులు నివేదించారు. ఈ పంటలన్నీ చివరి దశలో ఉన్నందున ఒక్క తడి అందిస్తే సాఫీగా చేతికొచ్చే అవకాశముంది. ఈమేరకు రైతుల విన్నపాలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. అంతేకాక జూలై వరకు ఎక్కడా తాగునీటి ఎద్దడి రాకుండా సాగర్ పరిధిలోని చెరువులను నింపాలని మంత్రి అధికారులకు సూచించారు. ప్రస్తుతం సాగర్ నుంచి పాలేరు వరకు 4,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, దిగువకు సుమారు 4వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పాలేరు రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 23 అడుగులకు గాను ప్రస్తుతం 21.5 అడుగులుగా ఉంది. ఈ నీటిని సమర్థవంతంగా వినియోగిస్తూ సాగు, తాగు అవసరాలకు మళ్లించాలని ఇంజనీర్లను మంత్రి ఆదేశించారు.
చెరువులు ఎండిపోవు...
సాగర్ జలాల పొడిగింపు నిర్ణయం జిల్లా రైతులకు ఉపశమనం కలిగించనుంది. ఇదే సమయాన తాగునీటి అవసరాలకు ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. జిల్లాలో 1,400కి పైగా చెరువులు ఉంటే, అందులో 700 చెరువులకు సాగర్ జలాలు చేరతాయి. ఆయా చెరువుల్లో ఇప్పటికే 50 – 100 శాతం నీటి నిల్వలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎక్కడైనా చేపల వేట కోసం నీరు విడుదల చేస్తే తప్ప సాగర్ పరిధిలో చెరువులు ఎండిపోయే అవకాశం లేదని తెలుస్తోంది. రానున్న రోజుల్లో నేరుగా సాగర్ జలాలతో నిండే 236 చెరువులకు సుమారు 2 టీఎంసీలు అవసరమనే అంచనాతో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
జిల్లాలో సాగర్ జలాలు చేరే చెరువుల పరిధిలో తాగునీటి ఎద్దడి ఎదురయ్యే అవకాశం లేదు. అయినా ప్రభుత్వ సూచనల మేరకు అన్ని చెరువులను నింపుతాం. ఇక పంటలు ఎక్కడా ఎండిపోకుండా నీరు అందించాం. కొన్నిచోట్ల ఇంకా నీరు అవసరమని విజ్ఞప్తులు అందుతున్నాయి. నిల్వల ఆధారంగా విడుదల చేసే అవకాశాన్ని పరిశీలిస్తాం. అయితే, తొలి ప్రాధాన్యత మాత్రం తాగు అవసరాలకు ఇస్తాం.
– మంగళపూడి వెంకటేశ్వర్లు, సీఈ, జలవనరులశాఖ


