ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి
వైరా/మధిర: మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణం సులువుగా సాగేలా మహిళలకు స్మార్ట్‌కార్డులు జారీ చేయనున్నట్లు టీఎస్ ఆర్‌టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. వైరా బస్టాండ్‌ను సోమవారం తనిఖీ చేసిన ఆయన మాట్లాడారు. మహిళలకు స్మార్ట్‌కార్డులు ఈ వేసవిలోనే ఇచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. తద్వారా ప్రతీసారి ఆధార్ కార్డు వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదని తెలిపారు. కాగా, రాష్ట్రంలో దాదాపు అన్ని బస్టాండ్లు 25 – 40 ఏళ్ల నాటివి కావడంతో సరైన నిర్వహణ లేక కూలి పోతున్నాయన్నారు. ఇందులో భాగంగా వైరా బస్టాండ్ అభివృద్ధికి త్వరలో ప్రణాళిక సిద్ధం చేస్తామని తెలిపారు. అంతేకాక ప్రయాణేతర ఆదాయ మార్గాల పరిశీలన కొనసాగుతోందని చెప్పారు. కాగా, వైరా బస్టాండ్‌లో గతంలో రెండేసి ఇన్, ఔట్ గేట్లు ఉన్నా రెండింటిని మూసివేయడంతో ఇబ్బంది ఎదురవుతోందని స్థానికులు ఎండీకి వివరించగా అది సాంకేతిక నిర్ణయమని స్పష్టం చేశారు. అలాగే, మధిర బస్టాండ్, డిపోను కూడా ఎండీ నాగిరెడ్డి పరిశీలించారు. మధిరలో బస్టాండ్ అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులతో సమీక్షించారు. అనంతరం తాత్కాలిక బస్టాండ్, డిపో గ్యారేజీలో పరిశీలించారు. కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోలోమన్, ఖమ్మం రీజినల్ మేనేజర్ సరిరామ్, డిప్యూటీ రీజినల్ మేనేజర్ మల్లయ్య, డిపో మేనేజర్ రామయ్య, ఉద్యోగులు పాల్గొన్నారు.


