షరతులు వర్తిస్తాయి..! | - | Sakshi
Sakshi News home page

షరతులు వర్తిస్తాయి..!

Apr 7 2026 7:31 AM | Updated on Apr 7 2026 7:31 AM

కేంద్రం ఏర్పాటు చేయాలి.. నిర్దేశిత ప్రాంతాల్లో కేంద్రాలు

ధర లేక దిగాలు..

అరకొరగానే మార్క్‌ఫెడ్‌ కొనుగోలు కేంద్రాలు

ఉమ్మడి జిల్లాలో 2.43లక్షల ఎకరాలకు 16కేంద్రాలే ఏర్పాటు

ఎకరానికి 26.5 క్వింటాళ్లే సేకరించేలా నిర్ణయం

బోనకల్‌ మండలం ముష్టికుంట్లలో ఆరబోసిన మక్కలు నేర్పుతున్న రైతు

ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది మొక్కజొన్న అధిక విస్తీర్ణంలో సాగైంది. ప్రస్తుతం పంట చేతికి వస్తుండగా ప్రభుత్వం

ప్రకటించిన మద్దతు ధర రూ.2,400తో కొనుగోళ్లకు మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యాన

అరకొరగానే కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇవి కూడా కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యాయి. దీంతో ప్రైవేట్‌ వ్యాపారులు క్వింటాకు రూ.1,600కు

మించి చెల్లించకపోవడంతో నష్టం

ఎదురవుతోంది. ఇదే సమయాన ఎకరానికి 40 – 50 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నా

కేవలం 26.5 క్వింటాళ్లే కొనుగోలు చేస్తామన్న షరతు రైతులకు ఇబ్బందిగా

మారింది. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం

పెరిగిన సాగు విస్తీర్ణం

ఈ ఏడాది యాసంగిలో ఉమ్మడి జిల్లాలో మొక్కజొన్న పంట విస్తారంగా సాగు చేశారు. గడిచిన వానాకాలంలో విస్తారంగా వర్షాలు కురవడంతో జలాశయాలు నిండడమే కాక భూగర్భ జలాలు ఆశించిన స్థాయిలో ఉండడంతో మొక్కజొన్న వైపు రైతులు మొగ్గు చూపారు. అంతేకాక అధిక వర్షాలతో పత్తి దెబ్బతినగా ఒకటి, రెండు తీతల తర్వాత తొలగించి మొక్కజొన్న వేశారు. ఫలితంగా ఏటా ఉమ్మడి జిల్లాలో సగటున 96 వేల ఎకరాల్లో సాగయ్యే మొక్కజొన్న ఈసారి ఏకంగా 2.43లక్షల ఎకరాలకు చేరింది. ఇందులో ఖమ్మం జిల్లాలో 1.70 లక్షల ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెంలో 73 వేల ఎకరాల్లో సాగైంది.

16 కేంద్రాలకే అనుమతి

మక్కలకు సరైన ధర లభించని సమయాల్లోనే కేంద్రప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. మూడేళ్ల క్రితం ఉమ్మడి జిల్లాలో 50వరకు కేంద్రాల్లో మక్కలు కొనుగోలు చేశారు. ఈసారి మాత్రం సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించింది. ఈమేరకు ఖమ్మంలో 11, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదు కలిపి కేవలం 16 కేంద్రాల ఏర్పాటుకే మార్క్‌ఫెడ్‌ సిద్ధమైంది. ఖమ్మం జిల్లాలో చింతకాని, మధిర, ఎర్రుపాలెం, బోనకల్‌, ఏదులాపురం(మద్దులపల్లి), జీళ్లచెరువు, మోటాపురం, కొణిజర్ల, మంచుకొండ, అల్లిపురం, కొత్తలింగాలలో, భద్రాద్రి జిల్లాలోని టేకులపల్లి, బోడు, ఇల్లెందు మార్కెట్‌, చల్లసముద్రం, కొమరారంలో మాత్రమే కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. దీంతో ఇతర ప్రాంతాల రైతులు పంట విక్రయాలకు ప్రైవేట్‌ వ్యాపారులను ఆశ్రయించక తప్పని పరిస్థితి ఎదురవుతోంది.

కొనుగోలు చేసేది సగమే..

మార్క్‌ఫెడ్‌ ద్వారా అరకొరగా కేంద్రాలను ఏర్పాటు చేసిన కేంద్రప్రభుత్వం సేకరణలోనూ కొర్రీలు పెడుతోంది. ఉమ్మడి జిల్లాలో 2.43 లక్షల ఎకరాల్లో మక్కజొన్న సాగైతే 6.25 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఎకరాకు 40 నుంచి 45 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. అయితే ఎకరాకు కేవలం 26.50 క్వింటాళ్లే కొనుగోలు చేస్తామని మార్క్‌ఫెడ్‌ చెబుతుండడం రైతులకు ఇబ్బందిగా మారింది. దీంతో మిగతా మక్కలను వ్యాపారులకు తక్కువ ధరతో అమ్మితే రైతులు నష్టపోవాల్సి వస్తుంది.

ప్రభుత్వ మద్దతు ధర రూ.2,400 ఉంటే దళారులు రూ.1,700 చెల్లిస్తున్నారు. ఎనిమిది ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్నలను కల్లంలో ఆరబోసి ఆరబోసి 15రోజులుగా ఎదురుచూస్తున్నా. ప్రభుత్వం మరింత ఆలస్యం చేస్తే.. ఆలోగా వర్షం వస్తే నష్టపోతాం.

– దూబ శ్రీను, ముష్టికుంట్ల, బోనకల్‌ మండలం

ప్రభుత్వ ఆదేశాలతో నిర్దేశించిన ప్రాంతాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో 10 కేంద్రాలను ప్రారంభించగా, భద్రాద్రి జిల్లాలో ప్రక్రియ కొనసాగుతోంది. నిబంధనల మేర రైతులు మొక్కజొన్నలను తీసుకురావాలి.

– శ్యామ్‌కుమార్‌, మార్క్‌ఫెడ్‌ మేనేజర్‌,

ఉమ్మడి జిల్లా

కేంద్ర ప్రభుత్వం మక్కలు క్వింటాకు రూ.2,400గా ధర ప్రకటించింది. కానీ మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యాన కొనుగోళ్లు ఆలస్యంగా మొదలయ్యాయి. ఇంతలోనే ప్రైవేట్‌ వ్యాపారులు రంగంలోకి దిగి క్వింటాకు రూ.1,600 చొప్పున కొనుగోళ్లు మొదలుపెట్టారు. నాణ్యత లేదని, తేమ ఉందనే కారణాలతో ధర తగ్గిస్తున్నారు. ఫలితంగా మద్దతు ధరతో పోలిస్తే రైతులు క్వింటాకు రూ.800 మేర నష్టపోతున్నారు. దీంతో రైతుల ఆందోళనలు, అభ్యర్థనల మేరకు ప్రభుత్వం మొక్కజొన్నల కొనుగోళ్లకు ముందుకొచ్చింది.

మక్కల విక్రయంలో రైతులకు తిప్పలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement