ఖమ్మంఅర్బన్: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళ, బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. మంగళవారం సాయంత్రం ఖమ్మం రానున్న మంత్రి 56వ డివిజన్ విజయనగర్ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశాక 20వ డివిజన్ రామచంద్రయ్య నగర్‌లో సబ్‌స్టేషన్‌ను ప్రారంభిస్తారు. అలాగే, బుధవారం ఉదయం 41వ డివిజన్ నిజాంపేట్‌లో అంధ విద్యార్థుల పాఠశాలను ప్రారంభించడంతో పాటు 34వ డివిజన్ పీసీకే తోటలో సీసీ రోడ్డు నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
సింగరేణి కార్మికులకు మజ్జిగ పంపిణీ ప్రారంభం
సత్తుపల్లిరూరల్: నానాటికీ ఎండలు పెరుగుతుండడంతో సింగరేణి కార్మికుల ఆరోగ్యం దృష్ట్యా మజ్జిగ పంపిణీని ప్రారంభించారు. సత్తుపల్లి ఏరియాలోని అన్ని విభాగాల్లో సోమవారం మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఓసీల్లో కార్మికులు, కార్యాలయాల ఉద్యోగులకు జేవీఆర్, కిష్టారం ఓసీల ప్రాజెక్టు ఆఫీసర్లు ఎస్.ప్రహ్లాద్, ఏఎల్‌ఎస్‌వీ.సునీల్‌వర్మ, సోమశేఖర్‌రావు ఆధ్వర్యాన మజ్జిగ పంపిణీ చేయగా అధికారులు మాట్లాడారు. గనులు, కార్యాలయాల సిబ్బంది వడదెబ్బ బారిన పడకుండా చల్లని తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ నిరంతరం అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు.
మార్క్‌ఫెడ్ మేనేజర్‌గా శ్యామ్‌కుమార్
ఖమ్మంవ్యవసాయం: మార్క్‌ఫెడ్ సంస్థ రాష్ట్రంలోని 13మంది మేనేజర్లను బదిలీ చేసింది. ఇందులో భాగంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల మేనేజర్ సునీతను సిద్దిపేటకు బదిలీ చేశారు. అలాగే, హనుమకొండ జిల్లా మేనేజర్ ఐ.శ్యామ్‌కుమార్‌కు ఖమ్మం, భద్రాద్రి జిల్లా మేనేజర్‌గా బదిలీ చేయడంతో పాటు మహబూబాబాద్ జిల్లా మేనేజర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు శ్యామ్‌కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించగా, మొక్కజొన్న కొనుగోళ్లపై అధికారులతో సమీక్షించారు.
టెక్స్‌టైల్స్ డిప్లొమా
కోర్సులో ప్రవేశానికి
దరఖాస్తులు
ఖమ్మంగాంధీచౌక్: హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హాండ్లూమ్ టెక్నాలజీ(ఐఐహెచ్‌టీ)లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు ఎం.విజయలక్ష్మి తెలిపారు. 2026–27 సంవత్సరానికి గాను చేనేత, టెక్స్‌టైల్స్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులో 60 సీట్లు ఉండగా, పదో తరగతి ఉత్తీర్ణత సాధించి 2026 జూలై 1నాటికి 23 ఏళ్లు నిండిన వారు అర్హులని పేర్కొన్నారు. అయితే, షెడ్యూల్ కులాలు, తెగల వారు 25ఏళ్ల వరకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఆసక్తి, అర్హతలు కలిగిన వారు హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఇతర వివరాలకు 90300 79242 నంబర్‌లో లేదా website: klbiht. telangana. gov. in వెబ్‌సైట్‌లో సంప్రదించాలని సూచించారు.
అవార్డులకు
నామినేషన్లు ఆహ్వానం
ఖమ్మంమయూరిసెంటర్: మే డే సందర్భంగా శ్రమశక్తి అవార్డులు, ఉత్తమ యాజమాన్య అవార్డులకు నామినేషన్లు ఆహ్వానిస్తున్నట్లు ఉప కార్మిక కమిషనర్ కె.విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. కార్మికుల సంక్షేమానికి విశేష సేవలందించిన కార్మికులు, ట్రేడ్ యూనియన్ నాయకులకు శ్రమశక్తి అవార్డులు అందజేయనున్నట్లు వెల్లడించారు. అలాగే, యూనియన్లు, కార్మికులతో సఖ్యతగా ఉంటూ రాష్ట్ర పురోగతికి దోహదపడిన చిన్న, మధ్యతరహా, పెద్ద పరిశ్రమల యాజమాన్యాలకు ఉత్తమ యాజమాన్య అవార్డులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈమేరకు ఉమ్మడి జిల్లాలోని ట్రేడ్ యూనియన్ల నాయకులు, కార్మికులు, పరిశ్రమల యాజమాన్యాలు నిర్ణీత ప్రొఫార్మాలో నామినేషన్లను ఈనెల 15వ తేదీలోగా అందజేయాలని సూచించారు, నామినేషన్ ప్రొఫార్మా, వివరాల కోసం డిప్యూటీ కమిషనర్ కార్మిక కార్యాలయంలో సంప్రదించాలని ఆయన తెలిపారు.


