భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలోని అంతరాలయంలో ఆదివారం మూలమూర్తులకు స్వర్ణ పుష్పార్చన, అభిషేకం జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. సెలవు రోజు కావడంతో ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
గోదావరికి నదీహారతి
భద్రాచలం: భద్రాచలం వద్ద పవిత్ర గోదావరికి ఆదివారం అర్చకులు నదీ హారతి సమర్పించారు. తొలుత నది ఒడ్డున చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు గోదావరి నదికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. అనంతరం శాంతిమంత్ర పఠనం జరిపి హారతులు సమర్పించారు. గ్రీన్ భద్రాద్రి అధ్యక్షుడు గోళ్ల భూపతిరావు దంపతులు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు రామవజుల రవికుమార్, సురేష్ శర్మ, అశోక్‌కుమార్, వీరభద్ర శర్మ, రామాచార్యులు, ప్రసాద్ శర్మ, ఫణికుమార్ శర్మ పాల్గొన్నారు.


