గత ఏడాది కంటే పెరిగాయి..
● ఇప్పటికే రూ.124 కోట్లకు పైగా వసూళ్లు ● గత ఏడాదితో పోలిస్తే 44 శాతం అధికం
ఖమ్మంఅర్బన్: జిల్లాలో మైనింగ్ శాఖ ద్వారా ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం సమకూరుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆదాయం 44 శాతం పెరిగినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది ఫిబ్రవరి నాటికి రూ.86.34 కోట్లు వసూలైతే, ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి రూ.124.32 కోట్లకుపైగా వసూళ్లు నమోదు కావడం విశేషం. తద్వారా గత ఏడాదితో పోలిస్తే రూ.37.99 కోట్ల లక్షల అదనపు ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరినట్లయింది.
గ్రానైట్ క్వారీలు, ఫ్యాక్టరీలు
జిల్లాలో ప్రధానంగా బ్లాక్ గ్రానైట్, కంకర, స్టోన్ క్రషర్లు తదితర మైనింగ్ కార్యకలాపాల ద్వారా భారీగా ఆదాయం సమకూరుతోంది. రాష్ట్రంలోనే ఎక్కువ సంఖ్యలో గ్రానైట్ క్వారీలు, ఫ్యాక్టరీలు ఉన్న జిల్లాల్లో ఖమ్మం ఒకటి కావడంతో మైనింగ్ రంగం ద్వారా ప్రభుత్వానికి గణనీయమైన రాబడి వస్తోంది. జిల్లాలోని 21 మండలాల్లో వివిధ రకాల మైనింగ్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఖమ్మం రూరల్, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, ఖమ్మంఅర్బన్, రఘునాథపాలెం, కూసుమంచి తదితర మండలాల్లో క్వారీలు, గ్రానైట్ పరిశ్రమల ద్వారా ఆదాయం అధికంగా వస్తోంది. ఇటీవల జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణం కొనసాగుతుండగా మట్టి, కంకర, గ్రానైట్ వినియోగంతో పాటే ఆదాయం మరింత పెరిగింది. ఇక అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవడం ద్వారా కూడా మైనింగ్ శాఖకు చెప్పుకోదగిన స్థాయిలో ఆదాయం లభించింది. అక్రమంగా మైనింగ్ సామగ్రి తరలిస్తున్న వాహనాలను సీజ్ చేయడం, క్వారీల్లో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన కార్యకలాపాలను గుర్తించి జరిమానా రూపంలో సుమారు రూ.4.03 కోట్లు వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 639 వాహనాలపై చర్యలు తీసుకుని రూ.1.45 కోట్ల జరిమానా వసూలు చేసినట్లు వెల్లడించారు.
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 44 శాతం అధిక ఆదాయం సాధించాం. ప్రభుత్వం రూ.150 కోట్లు లక్ష్యంగా నిర్దేశిస్తే, ఇప్పటివరకు రూ.124 కోట్లకుపైగా వసూలయ్యాయి. అక్రమ మైనింగ్‌పై నిరంతరం నిఘా ఉంచి కేసులు నమోదు చేస్తూ పెనాల్టీల రూపంలో కూడా గణనీయమైన ఆదాయం సాధిస్తున్నాం.
–సాయినాథ్, జిల్లా మైనింగ్ అధికారి (ఏడీ)


