● మరో ఐదుగురికి తీవ్ర గాయాలు ● మసివాగు వద్ద ఆటోను ఢీ కొట్టిన కారు ● మద్యం మత్తులో కారు నడపడం వల్లే ఘోరం | - | Sakshi
Sakshi News home page

● మరో ఐదుగురికి తీవ్ర గాయాలు ● మసివాగు వద్ద ఆటోను ఢీ కొట్టిన కారు ● మద్యం మత్తులో కారు నడపడం వల్లే ఘోరం

Mar 22 2026 1:38 AM | Updated on Mar 22 2026 1:38 AM

● మరో ఐదుగురికి తీవ్ర గాయాలు ● మసివాగు వద్ద ఆటోను ఢీ కొట్టిన కారు ● మద్యం మత్తులో కారు నడపడం వల్లే ఘోరం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

ఇల్లెందు రూరల్‌: మండలంలోని మసివాగు తండా వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృత్యువాత పడ్డారు. ఇల్లెందు మీదుగా మసివాగుకు ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను పాఖాల నుంచి ఇల్లెందు వైపు వస్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో గుగులోతు స్వప్న(58), బానోతు లక్ష్మి(55) మృతిచెందగా ఐదుగురికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే 108లో క్షతగాత్రులను ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో బాణోత్‌ రాజేశ్వరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం తరలించారు. మిగిలిన నలుగురికీ ఇల్లెందు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

తండ్రి మృతితో నిద్రకు వెళ్తుండగా..

కారేపల్లి మండలం చీమలపాడు సమీపంలోని బోటితండాకు చెందిన స్వప్న తండ్రి బానోతు నంద్యా ఇటీవల చనిపోయాడు. దీంతో స్వప్న కుటుంబసభ్యులను నిద్ర కోసం ఆమె చెల్లెలు స్రవంతి తన స్వగ్రామమైన మసివాగుకు ఆహ్వానించింది. ఈక్రమంలో స్వప్న కుటుంబసభ్యులు మొత్తం ఏడుగురు ఆటోలో శనివారం రాత్రి బోటితండా నుంచి బయల్దేరారు. ఇల్లెందు దాటే వరకు ప్రయాణం సాఫీగానే సాగింది. మరికొన్ని క్షణాల్లో మసివాగు చేరుకుంటారనగా వేగంగా దూసుకొచ్చిన కారు వీరి ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న వారు చెల్లా చెదురుగా రోడ్డుపై పడిపోయారు. ఆటోను సైడ్‌ నుంచి ఢీ కొట్టడంతో వెనుక సీట్లో కూర్చున్న బాణోత్‌ స్వప్న, లక్ష్మికి తీవ్ర గాయాలై ఘటనా స్థలిలోనే ప్రాణాలొదిలారు. మిగిలిన వారు చెల్లాచెదురుగా రోడ్డుపై పడిపోయి, తీవ్ర గాయాలతో రక్తసిక్తమయ్యారు. ఘటన జరిగిన తర్వాత ఆ దారిలో వెళ్లేవారు 108కు సమాచారం ఇచ్చారు. ఈలోగా స్థానికులు చేరుకుని గాయపడినవారికి సాయం చేశారు.

మద్యం మత్తులో కారుడ్రైవర్‌..

కారు నడుపుతున్న వ్యక్తి అతిగా మద్యం సేవించడం వల్లే ప్రమాదం జరిగిందని బాధితులు చెబుతున్నారు. మరి కాసేపట్లో గమ్యస్థానం చేరుకుంటామనగా ఒక్కసారిగా కారు ఆటోపైకి దూసుకొచ్చిందని, అప్పటికీ ఆటో డ్రైవర్‌ ప్రేమ్‌ చాకచక్యంగా పక్కకు వెళ్లినా, ప్యాసింజర్‌ సీటు భాగం వద్ద కారు బలంగా ఢీ కొట్టిందని తెలిపారు. ఇంత జరిగినా కారు నడిపే వ్యక్తి కనీసం కిందకు దిగకుండా మత్తులో అందులోనే కూర్చున్నాడని చెబుతున్నారు. చివరకు ఇల్లెందు సీఐ తాటిపాముల సురేశ్‌ ఘటనా స్థలానికి చేరుకుని కారు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వచ్చిన తర్వాత కూడా అతను మత్తులో నుంచి బయటకు రాలేదు.

రోదనలతో మార్మోగిన ఆస్పత్రి

రాత్రి 9:30 గంటలకు ప్రమాదం జరగగా పది గంటల సమయంలో ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి క్షతగాత్రులను తరలించారు. అప్పటికే ప్రమాద విషయం తెలుసుకున్న బోటి తండాకు చెందిన వారు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు వచ్చారు. బంధువుల రోదనలు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆస్పత్రి ప్రాంగణం విషాదభరితంగా మారింది. కాగా, ప్రమాదంలో బాణోతు ప్రేమ్‌, బాణోత్‌ శ్రీను, వనజ, మనోజ్‌ గాయపడ్డారు.

బీటీపీఎస్‌లో విద్యుత్‌కు అంతరాయం

మణుగూరురూరల్‌: మండల పరిధిలోని చిక్కు డుగుంట సమీపంలో గల బీటీపీఎస్‌ రెండో యూనిట్‌లో శనివారం సాంకేతిక లోపం తలెత్తి 270 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం వాటిల్లింది. బాయిలర్‌లోని పైప్‌ లీకవడంతో సమస్య ఏర్పడిందని, ఉత్పత్తి నిలిచిపోవడంతో పాటు సరఫరాకూ అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. వెంటనే మరమ్మతు పనులు చేయిస్తున్నామని, రెండురోజుల్లో సమస్య పరిష్కరిస్తామని సీఈ బిచ్చన్న తెలిపారు.

రెండో యూనిట్‌లో సాంకేతిక లోపం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement