ముంచిన నకిలీ విత్తనం | - | Sakshi
Sakshi News home page

ముంచిన నకిలీ విత్తనం

Mar 21 2026 4:58 AM | Updated on Mar 21 2026 4:58 AM

వరిలో తాలు కంకులు వచ్చాయని రైతుల ఆందోళన

షాపు ఎదుట నిరసన,

అధికారులకు ఫిర్యాదు

సత్తుపల్లిటౌన్‌: ఆరుగాలం కష్టించి పండించిన వరి చేతికొచ్చే సమయాన తాలు గింజలు రాగా.. నకిలీ విత్తనాలే కారణమని రైతులు లబోదిబోమంటున్నారు. సత్తుపల్లి మండలం సిద్ధారం, గౌరిగూడెం, రేజర్ల, నారాయణపురం, వేంసూరు మండలం భీమవరం తదితర గ్రామాలకు చెందిన రైతులు సుమారు 500 ఎకరాల్లో శ్రీరామా సీడ్స్‌ కంపెనీకి చెందిన ఆర్‌ఎన్‌ఆర్‌ 15048 విత్తనాలు సాగు చేశారు. 20 కేజీల ప్యాకెట్‌ను రూ.1,300 చొప్పున సత్తుపల్లిలోని వెంకటరమణ సీడ్స్‌ దుకాణంలో కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ వంగడంతో అధిక దిగుబడులు వస్తాయని డీలర్‌ చెప్పాడని.. తీరా పంట చేతికొచ్చే సమయాన వరి కంకుల్లో తాలు వచ్చిందని వాపోయారు. కంపెనీ బాధ్యులు, వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విత్తన దుకాణం ముందు నిరసన

నకిలీ విత్తనాల కారణంగా తాము నష్టపోయినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ రైతులు తాలు కంకులతో సత్తుపల్లిలోని వెంకటరమణ సీడ్స్‌ దుకాణం ఎదుట శుక్రవారం ఆందోళనకు దిగారు. అయితే యజమాని వారం రోజులుగా దుకాణం తీయటం లేదని తెలియడంతో పోలీసులు, వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేశారు. ఒక్కో ఎకరానికి రూ.35వేలు అప్పు చేసి పెట్టుబడి పెట్టిన తమను ఆదుకోవాలని కోరారు. రైతులు మందపాటి ముత్తారెడ్డి, మోరంపూడి ప్రసాద్‌, ప్రభాకర్‌, సాలి దేవదాసు, గోర్ల నాగిరెడ్డి, సోమిరెడ్డి, చింతల శివనాగిరెడ్డి, పుచ్చా వసంతరావు, ములకలపాటి సత్యనారాయణ, మరీదు నాగేశ్వరరావు, లింగారెడ్డి రామారావు పాల్గొన్నారు. కాగా, నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని సీపీఎం నాయకుడు జాజిరి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. సత్తుపల్లి మండలం సిద్ధారంలో వరి పొలాలను ఆయన నాయకులు కె.లక్ష్మణ్‌రావు, కృష్ణ, ప్రసాద్‌, రామకృష్ణ, వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, రమేష్‌తో కలిసి పరిశీలించి మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement