ఖమ్మం మామిళ్లగూడెం: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు, సమస్యలను గాలికొదిలేసిందని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈమేరకు సమస్యల పరిష్కారం, ఆరు గ్యారంటీల అమలు డిమాండ్‌తో శుక్రవారం కలెక్టరేట్ వద్ద బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ వెలుగుమట్లలో పేదల ఇళ్ల కూల్చివేత వెనుక భారీ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనాల కోసమే ఈ దుర్మార్గానికి ఒడిగట్టినందున ఇకనైనా తప్పు సరిదిద్దుకుని పేదలకు న్యాయం చేయాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేశారు. బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, నాయకులు పుల్లారావు, రవికుమార్, రవిరాథోడ్, గుత్తా వెంకటేశ్వర్లు, సుబ్బారావు, నాగేశ్వరరావు, మేకల నాగేందర్, సరస్వతి, రమేష్, నర్సింహారావు, నరేష్ పాల్గొన్నారు.


