● ఏడుగురి అరెస్ట్, 17బైక్‌లు స్వాధీనం
ఖమ్మంక్రైం: ఖమ్మంలో ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడుతున్న ఏడుగురిని ఖమ్మం త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమేరకు శుక్రవారం నగర ఏసీపీ రమణమూర్తి వివరాలు వెల్లడించారు. మామిళ్లగూడెం, కమాన్‌బజార్‌కు చెందిన కొండమీద యోగీశ్వర్, మేడ సాయికుమార్‌తో పాటు నలుగురు మైనర్లు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి ద్విచక్రవాహనాలను చోరీ చేసి అమ్మేసి ఆ డబ్బుతో జల్సాలు చేస్తున్నారు. ఈమేరకు వాహనాల తనిఖీల సందర్భంగా సీఐ మోహన్‌బాబు వీరిని విచారించగా వ్యవహారం బయటపడింది. దీంతో ఆరుగురితో పాటు వాహనాలు కొనుగోలు చేసిన కొణిజర్ల మండలం తీగల బంజరకు చెందిన ముద్దంగుల నరేష్, హరీఫ్, నునావత్ వినోద్‌పైనా కేసులు నమోదు చేశారు. ఇందులో హరీఫ్, వినోద్ పరారీలో ఉన్నారని, నిందితుల నుంచి రూ.11లక్షల విలువైన 17 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసిన సీఐ మోహన్‌బాబు, ఉద్యోగులను ఏసీపీ అభినందించారు. నిందితును కోర్టుకు రిమాండ్ చేసారు.
రూ.3కోట్లు మోసపోయామని ఆందోళన
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురంలోప్రైవేట్‌గా చీటీలు నడిపే కె.రామచంద్రరావు కానరాకుండా పోయాడని స్థానికులు ఆరోపించారు. సుమారు రూ.3కోట్ల డబ్బు ఇవ్వాల్సి ఉండగా కోర్టులో ఐపీ దాఖలు చేశాడని ఆరోపిస్తూ పలువురు శుక్రవారం ఎర్రుపాలెం పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. వ్యాపారి ఆచూకీ తెలుసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. సర్పంచ్ టి.నిర్మలకుమారి, ఉప సర్పంచ్ పార్వతి సమస్యను ఎస్‌ఐ రమేష్‌కుమార్‌కు వివరించగా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆందోళన విరమించారు.
పోక్సో కేసు నమోదు
ఖమ్మం అర్బన్: ఖమ్మం శివారులోని ఓ గ్రామంలో మైనర్లతో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిపై ఖమ్మం అర్బన్ పోలీసులు శుక్రవారం పోక్సో కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన ఇద్దరు మైనర్లు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయాన ప్రవీణ్ అనే వ్యక్తి వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించగా, బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ భానుప్రకాశ్ తెలిపారు.
పులిగుండాలలో పక్షుల వీక్షణ !
ఖమ్మంవ్యవసాయం: పెనుబల్లి మండలంలోని పులిగుండాల అడవిలో 70కు పైగా జాతులకు చెందిన పక్షులు నివాసముంటున్నాయని గుర్తించారు. ఈ పక్షులను సులువుగా వీక్షించేలా అటవీ శాఖ ద్వారా రాష్ట్రంలోనే తొలిసారి ప్రత్యేక నివాసాన్ని ఏర్పాటు చేశారు. వీక్షకులకు ఇబ్బంది లేకుండా బైనాక్యులర్లతో ఈ నివాసాన్ని రూపొందించారు. పక్షుల వీక్షణకు వచ్చే వారికి గైడ్‌గా బీట్ ఆఫీసర్‌ను కేటాయించనున్నట్లు జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ తెలిపారు.


