● రిజిస్ట్రేషన్ చేయించుకుని, పన్ను చెల్లించిన మున్సిపల్ కార్మికుడు ● పరిశీలించకుండానే ఇంటి నంబర్ కేటాయించిన ఉద్యోగి
వైరా: ఆక్రమణకు కాదేది అనర్హం అన్నట్లు మున్సిపల్ సిబ్బంది ఒకరు ప్రభుత్వ భూమిపై కన్నేయగా.. మనోడే కదా అనుకున్నారేమో కానీ ఆయనకు మున్సిపల్ ఉద్యోగి సహకరించడం విమర్శలకు తావిస్తోంది. భూమి ప్రభుత్వానిదని తెలిసినా ఆక్రమించుకున్న స్థలంలో ఇల్లు లేకున్నా ఇంటి నంబర్ ఇచ్చిన ఘటన ఇది. చివరకు విషయం బయటపడడంతో నంబర్‌ను రద్దు చేసి చేతులు దులుపుకున్నారు.
దర్జాగా రిజిస్ట్రేషన్
వైరా నడిబొడ్డున వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని ఆనుకుని 60 గజాల ప్రభుత్వ స్థలం ఉంది. ఈ స్థలాన్ని మున్సిపాలిటీ కార్మికుడు శ్రీకాంత్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఎలా చేయించుకున్నాడు, ఎవరెవరు సహకరించారో స్పష్టత లేకున్నా ఖాళీ స్థలంలోఇల్లు ఉందని చెబుతూ రూ.1,164 పన్ను చెల్లించి దరఖాస్తు చేసుకుంటే పరిశీలన మాటెత్తకుండా ఆర్‌ఐ ప్రదీప్ నంబర్ కేటాయించాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతోనే ఇంటి నంబర్‌ను ఆన్‌లైన్‌లో రద్దు చేశారు. ఆపై ఇన్‌చార్జి తహసీల్దార్ సురేష్, ఆర్‌ఐ నవీన్ ఆక్రమణకు గురైన స్థలాన్ని పరిశీలించి మున్సిపల్ సిబ్బందికి నోటీసులు జారీ చేశారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ గురులింగాన్ని వివరణ కోరగా మున్సిపల్ సిబ్బందికి నోటీసులు ఇచ్చి విచారణ చేపడతామని తెలిపారు.


