ఖమ్మం సహకారనగర్: జిల్లాలో ఎంపిక చేసిన తొమ్మిది ప్రభుత్వ పాఠశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు(టీపీఎస్)గా అభివృద్ధి చేయనున్నందున డిజైన్లు సిద్ధం చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్‌తో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎంపిక చేసిన తొమ్మిది స్కూళ్లలో 800నుంచి వేయి మంది విద్యార్థులకు అవసరమైన తరగతి గదులు, మౌలిక వసతులు కల్పించేలా లే ఔట్లు సిద్ధం చేయాలన్నారు. నాబార్డ్ నుంచి నిధులు రానున్నందున మార్గదర్శకాలకు అనుగుణంగా పనులు చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు. ఆతర్వాత పలు డిజైన్లను పరిశీలించి సూచనలు చేశారు. డీఈఓ చైతన్య జైనీ, విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ సీ.హెచ్.రామకృష్ణ, వివిధ శాఖల అధికారులు వెంకట్‌రెడ్డి, మహేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
●ఖమ్మంమయూరిసెంటర్: ప్రభుత్వ సంరక్షణలో ఉన్న ప్రతీ చిన్నారి ఆరోగ్యంగా, ఆనందంగా ఎదగడమే లక్ష్యంగా సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఖమ్మంలోని బాలల సదనాన్ని శుక్రవారం తనిఖీ చేసిన ఆయన నిర్వహణతో పాటు ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. పిల్లలతో మాట్లాడి మెనూ అమలు, ఇతర అంశాలపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ చిన్నారి ఆరోగ్యం, భద్రతపై సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని, దత్తత ప్రక్రియలో చట్టపరమైన విధానాలను అమలుచేయాలని సూచించారు. జిల్లా సంక్షేమ అధికారి వేల్పుల విజేత, జిల్లా శిశు సంరక్షణ అధికారి విష్ణువందన పాల్గొన్నారు.
●ఖమ్మంఅర్బన్: గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంలో పనిచేస్తూ ప్రమాదంలో కుడిచేయి కోల్పోయిన కార్మికుడికి రూ.31.31లక్షల నష్టపరిహారం అందింది. హెచ్‌జీ ఇంజనీరింగ్ లిమిటెడ్ కంపెనీ తరపున పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పరవేష్ గత ఏడాది జూలై 30న ప్రమాదంలో చేయి కోల్పోయాడు. ఈమేరకు యాజమాన్యం రూ.31,31,000 డిపాజిట్ చేయడంతో చెక్కును శుక్రవారం బాధితుడికి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అందజేశారు. కార్మికశాఖ ఉప కమిషనర్ కె.విజయభాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి


