1.77 లక్షల కేజీల చెత్త
జిల్లాలో చురుగ్గా ‘99 రోజుల కార్యాచరణ’ క్షేత్రస్థాయి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య పనులు, ఫైళ్ల పరిష్కారం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘పల్లెలు, పట్టణాల రూపురేఖలు మారి ప్రగతిబాట పట్టాలి.. గ్రామపంచాయతీ నుంచి జిల్లాస్థాయి వరకు అభివృద్ధి కొత్త పుంతలు తొక్కడమే కాక పాలన ప్రజలకు చేరువ కావాలి’ అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఈనెల 6న మొదలైన కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం మెరుగుదల, కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్, ప్రజారోగ్యం, రహదారుల మరమ్మతులు, నిర్మాణంతోపాటు ఇతర రంగాల్లో ప్రణాళికయుత అభివృద్ధిని ప్రాధాన్యతగా తీసుకున్నారు. జిల్లాలో ఈ కార్యక్రమ అమలును ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యవేక్షింస్తుండగా ఒక్కటొక్కటిగా చక్కబడుతున్నాయి.
పాలన చేరువయ్యేలా..
ప్రజలకు పాలన మరింత చేరువ చేయడం, ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించింది. 99 రోజుల పాటు ఐదు దశల్లో పది రకాల అంశాలపై ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇందులో ఆరోగ్యం, రోడ్డు భద్రత, సంక్షేమం, చిన్నారుల భద్రత–యాంటీ డ్రగ్ డ్రైవ్, రైతుల సంక్షేమం, విద్య, యూత్ అండ్ స్పోర్ట్స్, మహిళల అభ్యున్నతి, పర్యావరణం తదితర అంశాలు ఉన్నాయి. వీటి అమలు, పర్యవేక్షణకు ప్రభుత్వం యాప్‌ను కూడా సిద్ధం చేసింది. పది వారాల పాటు.. ప్రతీ వారం ఒక్కో శాఖకు సంబంధించిన కార్యక్రమాన్ని అమలు చేసేలా ప్రణాళిక రూపొందించారు.
అట్టహాసంగా ప్రారంభమై..
జిల్లాలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక అమలుపై ఈనెల 6న కలెక్టరేట్‌లో జరిగిన సన్నాహక సమావేశంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. అలాగే, ఈనెల 12న జరిగిన ప్రజాప్రతినిధులకు శిక్షణకు మంత్రి పొంగులేటి హాజరయ్యారు. ఆతర్వాత ఎమ్మెల్యేలు మాలోతు రాందాస్‌నాయక్, మట్టా రాగమయి వైరా, సత్తుపల్లిల్లో, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. ఇక కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వైరా, కొణిజర్ల మండలాల్లో పర్యటించడమే కాక ఖమ్మం శ్రీనివాసనగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.
సమన్వయంతో ప్రణాళిక
ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ప్రజాప్రతినిధులు, అధికారుల భాగస్వామ్యంతో ముందుకు సాగనుంది. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసేలా కార్యాచరణ రూపొందించారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో సర్పంచ్‌లు, కౌన్సిలర్లు ప్రధాన పాత్ర పోషించనున్నారు. ఇక అధికారులు ప్రజల నుంచి సమస్యలపై వినతులు స్వీకరించి సత్వర పరిష్కారం కోసం చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అంతేకాక రెండేళ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించడంతోపాటు జరుగుతున్న పనుల్లో నాణ్యతను పర్యవేక్షించాలి.
99 రోజుల కార్యాచరణలో మొదట పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యత దక్కింది. అలాగే పెండింగ్ ఫైళ్లను పరిష్కరిస్తున్నారు. జిల్లాలోని 571 గ్రామపంచాయతీల్లోని 5,214 వార్డులు, ఖమ్మం కార్పొరేషన్, సత్తుపల్లి, ఏదులాపురం, మధిర, వైరా, కల్లూరు మున్సిపాలిటీల్లోని వార్డులు, డివిజన్లలో పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. ఈ సందర్భంగా 1,77,539 కేజీల చెత్తను తొలగించడంతోపాటు 3,165 ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రం చేశారు. దీంతో దాదాపు పల్లెలు, పట్టణాలన్నీ పరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి. ఇక 11,326 పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేసినట్లు గణంకాలు చెబుతున్నాయి.


