ఖమ్మంమయూరిసెంటర్: ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ యుద్ధంతో దేశం గాయాల పాలైందని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అన్నారు. సోమవారం ఖమ్మంలోని డీసీసీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఎల్‌పీజీ సిలిండర్ల కోసం ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. కేంద్రం ఎలాంటి కొరత లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మరో మూడు నెలల్లో యుద్ధం ఆగకపోతే రైతులు కూడా నష్టపోతారన్నారు. పరిస్థితి ఇలా ఉంటే ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించకుండా.. ఎన్నికలే ఎజెండాగా ప్రచారం చేపట్టారని విమర్శించారు. విభజన హామీలను అమలు చేయడం లేదని, తెలంగాణపై కేంద్రం చిన్న చూపు చూస్తోందని ఆరోపించారు. అనంతరం వైరా మున్సిపల్ వైస్ చైర్మన్ సతీష్‌ను సన్మానించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఖమ్మం నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్‌చౌదరి పాల్గొన్నారు.


