పంట దిగుబడి అంతంతే..
గత ఏడాదితో పోలిస్తే 30 శాతం తగ్గుదల
ఎకరాకు సగటున మూడు క్వింటాళ్లే..
జిల్లాలో పత్తి కొనుగోళ్లపై
తీవ్ర ప్రభావం
జిల్లాలోని మార్కెట్ల వారీగా గత ఏడాది, ఈ ఏడాది కొనుగోళ్లు (క్వింటాళ్లలో)
ఖమ్మంవ్యవసాయం: అధిక వర్షాలు, ప్రతికూల వాతావరణం పత్తి దిగుబడులను తీవ్రంగా దెబ్బతీశాయి. గతేడాది మిర్చి పంటకు ధర లేకపోవటంతో ఈ ఏడాది పత్తి సాగు విస్తీర్ణం పెంచారు. పూత, పిందె దశలో వర్షాలు కురవటంతో పత్తి చేలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పత్తి పంట తీతలు సాధారణంగా మూడు సార్లు ఉంటాయి. ఈ ఏడాది ఒకటి, రెండు తీతలకే పరిమితమైంది. పల్లపు భూముల్లో సాగు చేసిన పత్తి పూర్తిగా చేతికి అందకుండా పోయింది. కొన్ని ప్రాంతాల్లో రైతులు దెబ్బతిన్న పత్తిని దున్ని మొక్కజొన్న పంటను సాగు చేశారు. నిపుణుల అంచనా ప్రకారం ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడి రావాలి. కొన్నేళ్లుగా ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్లకు మించకపోగా.. ఈ ఏడాది కనీసం ఎకరానికి సగటున 3 క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదని రైతులు వాపోతున్నారు.
విస్తీర్ణం పెరిగింది.. దిగుబడి తగ్గింది..
జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పంట సాగు విస్తీర్ణం పెరిగింది. గత ఏడాది 2,07,945 ఎకరాల్లో పంటను సాగు చేయగా, ఈ ఏడాది 2,56,871 ఎకరాల్లో పంటను సాగు చేశారు. గత ఏడాదితో పోలిస్తే పంట సాగు విస్తీర్ణం దాదాపు 49 వేల ఎకరాలు పెరిగింది. గత ఏడాది ప్రభుత్వ (సీసీఐ), ప్రైవేట్ కొనుగోళ్ల ఆధారంగా 10,37,818.75 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేట్ కొనుగోళ్ల ఆధారంగా కేవలం 7,35,816.35 క్వింటాళ్ల దిగుబడి వచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 3 లక్షల క్వింటాళ్ల దిగుబడి తగ్గింది. అంటే గత ఏడాదితో పోలిస్తే 30 శాతం పంట దిగుబడిలో తేడా ఉంది.
సీసీఐ వైపే మొగ్గు చూపిన రైతులు
ఈ ఏడాది ప్రైవేట్ మార్కెట్‌లో పత్తికి కనీస మద్దతు ధర లభించకపోవటంతో రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కేంద్రాల్లో విక్రయానికి మొగ్గు చూపారు. ఈ ఏడాది కేంద్రం తేమశాతం ఆధారంగా పత్తికి గరిష్టంగా క్వింటాల్‌కు రూ.8,110 (8 శాతం వరకు తేమ)గా నిర్ణయించింది. ప్రైవేట్ మార్కెట్‌లో వ్యాపారులు రూ.5 వేల నుంచి రూ.6 వేలకు మించి ధర పెట్టలేదు. ఈ ఏడాది పంట విక్రయాలకు ప్రభుత్వం కపాస్ కిసాన్ యాప్‌ను రూపొందించి అమలు పరిచింది. ఈ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని, నిర్దేశించిన విధంగా పంటను విక్రయించుకునే అవకాశం కల్పించారు. ఈ విధానంలో ఆరంభంలో రైతులు ఇబ్బందులు పడ్డారు. ఈ విధానాన్ని కూడా కొందరు వ్యాపారులు పక్కదారి పట్టించి, వినియోగించుకొని రైతుల నుంచి పంట కొనుగోలు చేసి బినామీల పేరిట సీసీఐ కేంద్రాల్లో విక్రయించారు. గత ఏడాది ప్రైవేట్ మార్కెట్‌లో 4,85,857.4 క్వింటాళ్ల కొనుగోళ్లు జరగగా, ఈ ఏడాది 2,76,587.4 క్వింటాళ్లను కొనుగోలు చేయగా.. 2.10 లక్షల క్వింటాళ్లు తగ్గినట్లయింది. గత ఏడాది సీసీఐ ద్వారా 5,51,961.35 క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరగగా, ఈ ఏడాది 4,59,229.05 క్వింటాళ్లు కొనుగోలు చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఏడాది సీసీఐ కొనుగోళ్లు 98 వేల క్వింటాళ్లు తగ్గాయి.
మార్కెట్ ప్రైవేట్ కొనుగోళ్లు సీసీఐ కొనుగోళ్లు
2024–25 2025–26 2024–25 2025–26
ఖమ్మం 2,07,637.4 1,81,869.8 1,00,265.15 1,13,559.60
మధిర 20,322.0 23,328.5 1,15,933.75 1,18,618.35
నేలకొండపల్లి –– 13.0 85,785.45 ––
కల్లూరు 2,492.0 567.0 –– ––
వైరా 22,455.0 39,405.0 54,939.70 43,174.95
ఏన్కూరు 2,31,001.0 30,798.0 –– ––
సత్తుపల్లి 680.0 486.0 –– ––
మద్దులపల్లి 1,270.0 120.0 1,95,037.30 1,83,876.15
మొత్తం 4,85,857.4 2,76,587.3 5,51,961.35 4,59,229.05


