స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తి..
జిల్లాలో అంగన్‌వాడీ భవనాల వివరాలు..
ఉపాధి నిధులతో నిర్మాణాలు
జిల్లాలో 40 సెంటర్లకు నిధులు మంజూరు
ఒక్కో కేంద్రానికి రూ.12 లక్షలు కేటాయింపు
చిన్నారులకు అక్షర జ్ఞానాన్ని అందిస్తూ, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ చేసే అంగన్‌వాడీ కేంద్రాలకు త్వరలోనే ‘సొంత గూడు’ లభించనుంది. ఏళ్ల తరబడి అద్దె భవనాలు, ఇరుకు గదుల్లో కొనసాగుతున్న కేంద్రాలకు విముక్తి కల్పించేలా జిల్లా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్ ఉపాధి హామీ పథకం నిధులతో అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశారు. జిల్లాలో 40 భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయగా పనులు వేగంగా సాగుతున్నాయి. నిర్మాణం పూర్తయిన భవనాలను ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. – ఖమ్మంమయూరిసెంటర్
80 భవనాలకు ప్రతిపాదనలు..
అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో నిర్వహిస్తుండగా పలు చోట్ల సకాలంలో కిరాయిలు చెల్లించక యజమానులు కేంద్రాలకు తాళం వేసిన ఘటనలు ఉన్నాయి. అద్దె చెల్లించాలంటూ అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలపై ఒత్తిడి తేవడంతో వారు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యారు. ఈ కష్టాలకు చెక్ పెట్టేందుకు సొంత స్థలం ఉన్న గ్రామాల్లో భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కలెక్టర్ ఆదేశాలతో జిల్లా సంక్షేమాధికారి కార్యాలయం నుంచి జిల్లా వ్యాప్తంగా తొలిదశలో 80 అంగన్‌వాడీ పాఠశాలలకు శాశ్వత భవనాలు నిర్మించాలని కోరుతూ ప్రతిపాదనలు పంపించారు. ఇందులో ఉపాధి పథకం నుంచి 40 భవనాల నిర్మాణాలకు అనుమతులు మంజూరయ్యాయి.
రూ.12 లక్షలతో నిర్మాణం..
జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల అవసరాలను గుర్తించిన ప్రభుత్వం మొదటి విడతగా 40 సెంటర్లను ఎంపిక చేసింది. నిర్మాణానికి ఒక్కో భవనానికి రూ.12 లక్షల చొప్పున నిధులు విడుదలయ్యాయి. వీటిలో ఉపాధి హామీ పథకం కింద రూ.8 లక్షలు, సీ్త్ర, మహిళా, శిశు సంక్షేమ శాఖ నుంచి రూ.2 లక్షలు, ఇతర గ్రాంట్స్ నుంచి మరో రూ.2 లక్షలు ఇవ్వనున్నారు. ఈ నిధులతో సకల సౌకర్యాలతో కూడిన భవనాలు నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు. గతంలో ఉన్న నిధుల కొరత తీరడం, పనులు పట్టాలెక్కడంతో ఇప్పటికే కొన్ని భవనాల నిర్మాణం పూర్తి కాగా, మరికొన్ని చివరి దశకు చేరుకున్నాయి.
అత్యాధునిక వసతులతో..
చిన్నారులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా అంగన్‌వాడీ భవనాలను తీర్చిదిద్దనున్నారు. ఆడుకోవడం, చదువుకోవడానికి సరైన ఏర్పాట్లతో పాటు తగినంత గాలి, వెలుతురు వచ్చేలా నిర్మాణం చేపడుతున్నారు. పిల్లల ఆరోగ్యం దృష్ట్యా ప్రత్యేకంగా రక్షిత మంచినీటి సౌకర్యం, ఆధునిక మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. పౌష్టికాహారాన్ని పరిశుభ్రంగా వండేందుకు ప్రత్యేకంగా కిచెన్ రూమ్ నిర్మిస్తున్నారు.
చిన్నారుల భవిష్యత్‌కు భరోసా..
ప్రస్తుతం జిల్లాలో అనేక కేంద్రాలు అద్దె ఇళ్లు, పాతబడిన ప్రభుత్వ పాఠశాల గదుల్లో నడుస్తున్నాయి. వర్షాకాలంలో కురవడం, ఇరుకు గదులతో పిల్లలు ఇబ్బంది పడడం వంటి సమస్యలు సాధారణంగా మారాయి. ప్రస్తుతం నిర్మిస్తున్న సొంత భవనాలతో కేంద్రాలకు హాజరయ్యే పిల్లల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పౌష్టికాహార పంపిణీ వ్యవస్థ కూడా మరింత పటిష్టం కానుంది.
భవన నిర్మాణానికి ప్రధాన ఆటంకమైన ‘స్థల సేకరణ’పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలోని వివిధ మండలాల్లో ఎంపిక చేసిన 80 కేంద్రాలకు ఇప్పటికే ప్రభుత్వ స్థలాలను గుర్తించారు. స్థానిక సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శుల సహకారంతో అనువైన ప్రదేశాలను ఎంపిక చేయగా, ఈ స్థలాలను అంగన్‌వాడీ విభాగం పేరున బదిలీ ప్రక్రియ కూడా పూర్తయింది. తద్వారా భవిష్యత్‌లో స్థల వివాదాలు తలెత్తకుండా పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు.
సొంత భవనాలు – 887
ఉచిత అద్దె భవనాలు – 442
అద్దె భవనాలు – 501
అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు


