కొణిజర్ల: ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు ఆధునిక పరికరాలు పంపిణీ చేస్తామని, అన్ని రంగాల్లో నైపుణ్యాలు సాధించేందుకు శిక్షణ, సహకారం అందిస్తామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వెల్ల డించారు. కొణిజర్లలోని భవిత కేంద్రం, చిన్నమునగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను సోమవారం ఆయన పరిశీలించారు. కొణిజర్లలోని భవిత కేంద్రంలో వాల్ పెయింటింగ్, ఫిజియోథెరపీ, వినికిడి స్పీచ్ థెరపీ మిషనరీ, కృత్రిమ పరికరాలతో విద్యార్థులకు అందిస్తున్న శిక్షణ, వసతుల వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు మెరుగు పరచాలని సిబ్బందిని ఆదేశించారు. చిన్నమునగాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమ అమలును తనిఖీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులు, గర్భిణులకు క్రమం తప్పకుండా కోడిగుడ్లు, పౌష్టికాహారం అందించాలన్నారు. భవిత కేంద్రాల్లో ప్రత్యేక విద్యా విధానం ద్వారా పిల్లలు మానసికంగా అభివృద్ధి చెందుతున్నారని చెప్పారు. దివ్యాంగులైన చిన్నారుల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. భవిత సెంటర్లలో ప్రతిపాదించిన అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. శిథిలావస్థకు చేరిన పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల భవనాలను గుర్తించి తన దృష్టికి తీసుకురావాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో సీఎంఓ ప్రవీణ్‌కుమార్, విద్యా శాఖ ఈఈ బుగ్గయ్య, కొణిజర్ల ఎంఈఓ డి.అబ్రహం, హెచ్‌ఎం నాగమల్లేశ్వరరావు, సర్పంచ్ పూనాటి బాబూరావు, ఏఈ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వెల్లడి


