కల్లూరురూరల్: మండలంలోని రఘునాథబంజర గ్రామంలో ఆదివారం ఉదయం తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన బండి నర్సింహారావు (48) కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కగా ప్రమాదవశాత్తు పైనుంచి కిందపడ్డాడు. తోటి కార్మికులు ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య ధనలక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని సర్పంచ్ కుక్క సుధారాణి, కాంగ్రెస్ నాయకుడు కుక్క రాణా, పలువురు సందర్శించారు.
విద్యుదాఘాతంతో కార్యదర్శి...
కారేపల్లి: విద్యుదాఘాతంతో పంచాయతీ కార్యదర్శి మృతి చెందిన ఘటన కారేపల్లి మండలం మంగళతండాలో ఆదివారం చోటుచేసుకుంది. కామేపల్లి మండలం గోవింద్రాలకు చెందిన లకావత్ సురేశ్ (32) ఏన్కూర్ మండలం తిమ్మారావుపేట గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తూ.. అత్తగారి ఇళ్లు అయిన కారేపల్లి మండలం మంగళితండాలో ఉంటున్నాడు. ఇంటి మరమ్మతులు నిర్వహిస్తుండగా విద్యుదాఘాతానికి గురై పడిపోయాడు. అతడిని ఇల్లెందు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడికి భార్య కాజారాణి, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ద్విచక్రవాహనం, లారీ ఢీ
కొణిజర్ల: మండలంలోని గుబ్బగుర్తి సమీపంలో ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో మండలంలోని అన్నవరం గ్రామానికి చెందిన బాణోత్ గణేశ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 ద్వారా ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. 108 సిబ్బంది సతీశ్, మోహనకృష్ణ ప్రాథమిక చికిత్స అందించారు.


