రఘునాథపాలెం: రైతులు ఆర్థికంగా బలపడాలంటే పంటల విస్తరణతో పాటు ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రఘునాథపాలెం మండలంలోని రైతు వేదికలో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి వ్యవసాయ యాంత్రీకరణ సదస్సులో రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మంచుకొండ ఎత్తిపోతల పథకం ద్వారా చెరువులకు నీటి వసతి కల్పించామని, వేసవికాలంలోనూ చెరువులు నిండుగా ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతులు ఆయిల్‌పామ్ సాగు వైపు మొగ్గుచూపి మరింతగా లాభాలు గడించాలన్నారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని చెప్పారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రైతులు పరికరాలు కొనుగోలు చేస్తే సబ్సిడీని రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. రాజకీయాల్లో నిజాయితీగా ఉండాలంటే వ్యవసాయం ద్వారా ఆదాయం ఉండాలని అన్నారు. గత ప్రభుత్వ కాలంలో ఖమ్మం పరిసర ప్రాంతాల్లో భూకబ్జాలు పెరిగాయని ఆరోపించిన మంత్రి.. వెలుగుమట్ల భూదాన్ భూముల్లో మాఫియా తరహాలో వ్యవహరిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. నీరు, విద్యుత్, రహదారులు లేకుండా పేదలు ఉండొద్దని, అక్రమ నిర్మాణాలను తొలగించాలనే కోర్టు ఆదేశాల మేరకే కూల్చివేశామని వివరించారు. ఈనెల 22న సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి, డీఏఓ ధనసరి పుల్లయ్య, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి మధుసూదన్, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ ఆశోక్‌కుమార్, ఏడీఏ కె.వెంకటేశ్వర్లు, ఖమ్మం మార్కెట్ చైర్మన్ యరగర్ల హనుమంతరావు, మాజీ చైర్మన్ ఎం.రాధాకిషోర్, ఆత్మ చైర్మన్ దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు, రఘునాథపాలెం సర్పంచ్ గాజుల కృష్ణారావు, పీఏసీఎస్ రఘునాథపాలెం సొసైటీ మాజీ చైర్మన్ తాతా రఘురాం, ఏఓలు కర్నాటి ఉమామహేశ్వరరెడ్డి, భాస్కర్‌రావు, నగరకాంగ్రెస్ అధ్యక్షుడు నాగండ్ల దీపక్‌చౌదరి, సాధు రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల


