ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మంలోని స్వయంభూ శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం(గుట్ట) అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా డాక్టర్ కూరపాటి ప్రదీప్‌కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. అలాగే, కమిటీ సభ్యులుగా కర్నాటి రాధిక, చిన్ని మధుసూదన్‌రావు, చల్లా మధుసూదన్ రావు, మోర్ల శ్రీనివాస్, మందడపు సాయివెంకటకృష్ణ, కొల్లా నాగేందర్, చారుగుండ్ల రవికుమార్, పంతం సీతారాములు, శనగవరపు ప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం చైర్మన్, కమిటీ సభ్యులను పలువురు సన్మానించారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ పర్యవేక్షకురాలు సమత, ఆలయ ఈఓ కొత్తూరు జగన్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం చైర్మన్ కూరపాటి మాట్లాడుతూ దేవస్థానం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
రూ.కోటి వ్యయంతో పవర్ ట్రాన్స్‌ఫార్మర్
రఘునాఽథపాలెం: రఘునాథపాలెం సబ్‌స్టేషన్‌లో రూ.కోటి విలువైన 5 ఎంవీఏ సామర్థ్యంతో పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇన్నాళ్లు 3.15 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌తో సరఫరా కొనసాగుతోంది. అయితే, గ్రామాల్లో లోఓల్టేజీ సమస్య నివారణ కోసం అధిక సామర్థ్యంతో కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటుచేయగా శనివారం ప్రారంభించారు. డీఈలు రామారావు, భద్రుపవార్, ఏడీఈ సంజీవ్ కుమార్, ఏఏఈ శంకర్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
వేసవి దృష్ట్యా ఏసీ బస్సులు
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం కొత్త బస్టాండ్ నుండి హైదరాబాద్, మియాపూర్, బెంగళూరుకు రాజధాని, లహరి ఏసీ బస్సులతో పాటు సూపర్ లగ్జరీ బస్సులు నడిపిస్తున్నట్లు ఖమ్మం డిపో మేనేజర్ శివప్రసాద్ తెలిపారు. వేసవి దృష్ట్యా ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు ఉదయం 4నుంచి రాత్రి 10–45గంటల వరకు, హైదరాబాద్ నుంచి ఖమ్మంకు ఉదయం 4–15 నుంచి రాత్రి 11–30 గంటల వరకు ప్రతీ 45 నిమిషాలకొక నాన్ స్టాప్ ఏసీ రాజధాని బస్సులు ఉంటాయని వెల్లడించారు. ఖమ్మం నుంచి మియాపూర్‌కు ఏసీ బస్సులు తెల్లవారుజామున 3–15 గంటలకు, మధ్యాహ్నం 12–30 గంటలకు, సాయంత్రం 4–15, 6–40, రాత్రి 11–15 గంటలకు నడుస్తాయని, మధ్యాహ్నం 3గంటలకు బెంగళూరుకు ఏసీ లహరి స్లీపర్ బస్సు అందుబాటులో ఉందని తెలిపారు. అలాగే, ఖమ్మం నుంచి శ్రీశైలంకు రాత్రి 12–15 గంటలకు, విశాఖపట్నంకు ఉదయం 7–30, రాత్రి 7, 9గంటలకు సూపర్ లగ్జరీ బస్సులలతో పాటు ఉదయం 9గంటలకు రాజధాని బస్సు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. రిజర్వేషన్ కోసం బస్‌స్టేషన్‌లోని కౌంటర్‌లో లేదా www.tgsrtcbus.in వెబ్‌సైట్‌లో సంప్రదించాలని డీఎం సూచించారు.
పండితాపురం సంత వేలం మళ్లీ వాయిదా
కామేపల్లి: కొమ్మినేపల్లి (పండితాపురం) గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ కృష్ణప్రసాద్ పశువుల వారాంతపు సంత కౌలు వేలం మరోమారు వాయిదా పడింది. తొలుత వేలం శుక్రవారం నిర్వహించాల్సి ఉండగా పోలీసుల సూచనతో వాయిదా వేశారు. తిరిగి శనివారం డీపీఓ రాంబాబు ఆధ్వర్యాన సంత ఆవరణలో వేలం నిర్వహించారు. గ్రామానికి చెందిన భూక్యా వీరన్న, బోడా గణేష్, బోడా శ్రీను, ధరావత్ విన్నిబాబు, గుగులోత్ వినోద్‌కుమార్ ధరావత్, స్వాలెన్సీ రూ.35 లక్షల చొప్పున చెల్లించి పాటలో పాల్గొన్నారు. అయితే, రూ.1,81,90,000 తో హెచ్చు పాటదారుడిగా బోడా శ్రీను నిలిచినా, గతేడాది పాట రూ.2,42,30,000 కంటే తక్కువ రావడంతో వాయిదా వేశారు. మళ్లీ ఎప్పుడు వేలం నిర్వహించేది త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. సర్పంచ్ ధరావత్ అనురాధ, ఉపసర్పంచ్ మేకల మల్లికార్జున్‌రావు, ఎంపీడీఓ రవీందర్, ఎంపీఓ వీ.వీ.శాస్త్రి, కార్యదర్శులు శంకర్, విక్రమ్, నెహ్రూ, నర్సింహా, రాజేందర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఏకలవ్య పాఠశాలల మెరిట్ జాబితా విడుదల
భద్రాచలంటౌన్: ఖమ్మం రీజియన్ పరిధిలోని ఏకలవ్య మోడల్ గిరిజన పాఠశాలల్లో బోధనేతర (ఔట్‌సోర్సింగ్) సిబ్బంది భర్తీకి తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల చేసినట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. గతేడాది నవంబర్ 24 నుంచి డిసెంబర్ 10 వరకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలతో జాబితాను భద్రాచలం ఐటీడీఏ ఆవరణలోని ఆర్‌సీఓ కార్యాలయ నోటీసు బోర్డులో ప్రదర్శించినట్లు వెల్లడించారు. అభ్యర్థులు జాబితాను పరిశీలించి అభ్యంతరాలు ఉంటే ఈనెల 18లోగా కార్యాలయ పనివేళల్లో స్వయంగా సమర్పించాలని సూచించారు.


