● ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ● ముగిసిన సీపీఐ శిక్షణా తరగతులు
పాల్వంచ: కమ్యూనిస్టు ప్రజా ప్రతినిధులు ఎల్లప్పుడూ ప్రజల పక్షానే పనిచేయాలని ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ అన్నారు. పాల్వంచలో నిర్వహిస్తున్న సీపీఐ ప్రజాప్రతినిధుల రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు రెండో రోజు శనివారం ముగిశాయి. తరగతుల్లో ‘ప్రజా ప్రతినిధులుగా కమ్యూనిస్ట్‌ల పాత్ర’ అనే అంశంపై నాగేశ్వర్ మాట్లాడారు. కమ్యూనిస్టులతోనే మెరుగైన పాలన సాధ్యమని, నూతనంగా ప్రజాప్రతినిధులు ఆ దిశగా అడుగులు వేయాలన్నారు. యూపీఏ–1 ప్రభుత్వంలో కమ్యూనిస్టులు కలిసి ఉన్నప్పుడు ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం, అటవీ హక్కుల చట్టం వంటి ప్రజా ప్రయోజన చట్టాలు అమల్లోకి వస్తే యూపీఏ–2 నుంచి వైదొలగడంతో అన్నీ కుంభకోణాలే జరిగాయన్నారు. కమ్యూనిస్టు ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేయాలన్నారు. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ హక్కులు, నిధుల కోసం పోరాడాలన్నారు. ఆర్టీఐ మాజీ కమిషనర్ ప్రొఫెసర్ మాడభూసి శ్రీధర్ మాట్లాడుతూ దేశ పౌరులుగా హక్కుల కోసం పోరాడటంతో పాటు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని చెప్పారు. ఆతర్వాత సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడగా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, నాయకులు పశ్య పద్మ, ఎస్‌కె.సాబీర్‌పాషా, సృజన్, వెంకటేశ్వరరావు, విశ్వనాథం, అజయ్ సారధి తదితరులు పాల్గొన్నారు.


