సత్తుపల్లిటౌన్: పోడు భూముల వద్ద అటవీశాఖ అధికారులు శుక్రవారం ట్రెంచ్ తవ్వకాలు చేపడుతుండగా గిరిజనులు అడ్డుకున్నాడు. సత్తుపల్లి మండలం గుడిపాడులో అయ్యగారిపేట, తామరచెరువు శివారు పోడు భూముల్లో 2005 కంటే పూర్వం నుంచి తాము సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని గిరిజనులు తెలిపారు. మున్సిపల్ కౌన్సిలర్ మట్టా ప్రసాద్ ఆధ్వర్యాన గిరిజనులు తమకు న్యాయం చేయాలంటూ కోరారు. స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని అటవీశాఖ ఉద్యోగులతో వాగ్వాదానికి దిగడంతో వివాదం నెలకొంది. వీఎస్‌ఎస్‌లో భాగస్వామ్యం చేసి వచ్చిన ఫలాలనే అందిస్తాం తప్ప భూములపై హక్కు ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే రాగమయికి కౌన్సిలర్ ఫోన్ ద్వారా తెలపగా ఆమె రేంజర్ స్నేహలతతో మాట్లాడి త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని చెప్పడంతో వివాదం సర్ధుమణిగింది.


