‘పది’ పరీక్షలకు రెడీ.. | - | Sakshi
Sakshi News home page

‘పది’ పరీక్షలకు రెడీ..

Mar 13 2026 7:41 AM | Updated on Mar 13 2026 7:41 AM

జిల్లాలో 98 కేంద్రాలు, 17,293 మంది విద్యార్థులు ఉదయం 9–35 గంటల వరకు కేంద్రాల్లోకి అనుమతి

అన్ని వసతులు కల్పించాం..

ఖమ్మంసహకారనగర్‌: పదో తరగతి వార్షిక పరీక్షలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈనెల 14వ తేదీన శనివారం ప్రారంభమయ్యే పరీక్షల కోసం 98 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 17,293 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో రెగ్యులర్‌ విద్యార్థులు 16,975 మంది ఉండగా, ప్రైవేట్‌ విద్యార్థులు 318మంది ఉన్నారు. కాగా, నిర్ణీత తేదీల్లో పరీక్షలు ఉదయం 9–30 నుంచి మద్యాహ్నం 12–30గంటల వరకు జరుగుతాయి. అయితే, ఫస్ట్‌ లాంగ్వేజ్‌, కాంపోజిట్‌ కోర్సు, సైన్స్‌ పరీక్షలు 9–30 నుంచి 12–50గంటల వరకు జరగనున్నాయి. కాగా, విద్యార్థులను 8–30గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తామని, 9–35గంటల తర్వాత అనుమతి ఉండదని అధికారులు వెల్లడించారు.

కేంద్రాల్లో సౌకర్యాలు

వేసవి దృష్ట్యా పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు ఇబ్బంది పడకుండా యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. పరీక్ష సమయంలో విద్యుత్‌ అంతరాయం ఏర్పడకుండా చూడడంతో పాటు తాగునీటి, వైద్యసౌకర్యం కల్పిస్తారు. అలాగే, విద్యార్థులు సమయానికి కేంద్రాలకు చేరుకునేగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించనుంది. అంతేకాక కేంద్రాల వద్ద పోలీసు ఆంక్షలు అమలుచేయడంతో పాటు సమీపంలోని జిరాక్స్‌, ఇంటర్నెట్‌ సెంటర్లు మూసివేయాలని ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశించారు.

కంట్రోల్‌ రూం ఏర్పాటు

ఏమైనా ఇబ్బందులు ఎదురైతే విద్యార్థులు సంప్రదించేలా విద్యాశాఖ ఆధ్వర్యాన కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటుచేశారు. అవసరమైన విద్యార్థులు 83318 51510 నంబర్‌కు ఫోన్‌ చేస్తే ఉద్యోగులు వారి సందేహాలను నివృత్తి చేస్తారు. అంతేకాక మునుపెన్నడూ లేని విధంగా ఈసారి కేంద్రాల్లో క్లాక్‌రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులు పరీక్షకు వచ్చేటప్పుడు ఏమైనా సామగ్రి తెచ్చుకుంటే అందులో భద్రపర్చుకునేలా వీలుంటుంది.

ముందుగా చేరుకోవాలి

పదో తరగతి విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగా చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అంతేకాక కొన్ని కేంద్రాల పేర్లు ఒకటే తరహాలో ఉన్నందున ముందుగానే సెంటర్‌ను సరిచూసుకుంటే చివరి నిమిషంలో ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు. 9–30గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా విద్యార్థులను 8–30నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తామని వెల్లడించారు.

రేపటి నుంచి ఎస్సెస్సీ పరీక్షలు

పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. కేంద్రాల వద్ద తాగునీరు సమకూర్చడమే కాక వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. విద్యుత్‌ అంతరాయం లేకుండా చూస్తాం. విద్యార్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకుంటే ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయొచ్చు.

– చైతన్య జైనీ, జిల్లా విద్యాశాఖాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement