యంత్రతంత్రం | - | Sakshi
Sakshi News home page

యంత్రతంత్రం

Mar 13 2026 7:41 AM | Updated on Mar 13 2026 7:41 AM

● చిరు వ్యాపారులకు పీఎంఎఫ్‌ఎంఈ ద్వారా చేయూత ● ఆహార ప్రాసెసింగ్‌ యూనిట్లకు సబ్సిడీ ● పథకం ద్వారా జిల్లాలో 400 యూనిట్ల లక్ష్యం

ఆర్థిక మద్దతు

● చిరు వ్యాపారులకు పీఎంఎఫ్‌ఎంఈ ద్వారా చేయూత ● ఆహార ప్రాసెసింగ్‌ యూనిట్లకు సబ్సిడీ ● పథకం ద్వారా జిల్లాలో 400 యూనిట్ల లక్ష్యం

సాక్షిప్రతినిధి, ఖమ్మం: చిరు వ్యాపారులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రధానమంత్రి ఫార్మలైజేషన్‌ ఆఫ్‌ మైక్రో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (పీఎంఎఫ్‌ఎంఈ) పథకం దోహదపడుతోంది. సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్‌ రంగం ఆధునికీకరణ, పోటీతత్వాన్ని పెంచడమే లక్ష్యంగా 2020లో ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. పచ్చళ్ల తయారీ, బేకరీ ఉత్పత్తులు, నూడుల్స్‌ వంటి అసంఘటిత మైక్రో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో ఉన్న వారికి ఈ పథకం వరంలా మారనుంది. 2021–22 ఏడాది నుంచి 2025–26 వరకు జిల్లాలో 400 యూనిట్లకు రుణ సదుపాయం కల్పించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో 216 యూని ట్లకు రుణాలు మంజురు చేయగా 185 యూనిట్లకు సబ్సిడీ విడుదలైంది.

ఆధునికీకరణ, మార్పులు

సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్‌ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎంఎఫ్‌ఎంఈ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. అసంఘటిత రంగాన్ని ఆధునికీకరించడమే కాక ఇప్పటికే ఉన్న సంస్థల్లో పోటీతత్వాన్ని పెంచేలా సాంకేతికత, ఆర్ధికసాయం, శిక్షణ అందించేందుకు ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ చొరవతో ఈ పథకం అమలవుతోంది.

సాంకేతికత, వ్యాపార మెళకువలు

ఆర్థిక సాయం అందించి వదిలేయకుండా పీఎంఎఫ్‌ఎంఈ పథకం ద్వారా సాంకేతిక, వ్యాపార మెళకువలను కూడా అందిస్తారు. నాణ్యతలో రాజీ పడకుండా ఖర్చులు తగ్గించగల ప్రాంతాల గుర్తింపు, వృథాను తగ్గించడం, సామర్థ్యాన్ని పెంచగల సాంకేతికత కోసం నిధుల్లో కొంత మేర ఉపయోగపడతాయి. ఆర్థిక సాయం, శిక్షణ, సాంకేతిక సాయంతో చిన్న తరహా పరిశ్రమలు పూర్తిస్థాయిలో పురోగమించడానికి వీలవుతుంది.

రూ.11.73 కోట్ల రుణం

జిల్లాలో 2021–22 నుంచి ఇప్పటి వరకు 400 యూనిట్లకు రుణాలు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈమేరకు 745 మంది డీపీఆర్‌(డిటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్ట్‌)లను బ్యాంక్‌లకు సమర్పించారు. పరిశీలన అనంతరం 216 యూనిట్లకు రూ.11.73 కోట్ల రుణం మంజూరైంది. మరో 134 యూనిట్లకు రుణ చెల్లింపులు పురోగతిలో ఉన్నాయి. అలాగే 185 యూనిట్లకు సబ్సిడీ కూడా విడుదలైంది. రుణాలు, సబ్సిడీ అందుతుండటంతో సూక్ష్మ ఆహార పరిశ్రమలను ఏర్పాటుకు నిరుద్యోగ యువత ఆసక్తి కనబరుస్తున్నందున... పథకం అమలుతో జిల్లాలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు.

ఈ పథకం పచ్చళ్ల తయారీ, బేకరీ(స్వీట్స్‌, కేక్‌లు), పసుపు, కారం, పప్పు, బియ్యం మిల్లుల ఏర్పాటు, నూడుల్స్‌ తయారీ కేంద్రాలు, తినుబండారాలు, చపాతీ తయారీ తదితర చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు మద్దతుగా నిలుస్తుంది. వ్యక్తులు, యాజమాన్యాలు, ఎఫ్‌పీఓలు, సహకార సంస్థలు, ఎస్‌హెచ్‌జీలు, ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలకు ప్రాజెక్టు వ్యయంలో 35 శాతం సబ్సిడీ అందుతుంది. చిన్న పనిముట్ల కొనుగోలు కోసం ప్రతీ స్వయం సహాయక సంఘ సభ్యుడికి రూ.40 వేలు అందిస్తారు. అలాగే ఉత్పత్తుల బ్రాండింగ్‌, మార్కెటింగ్‌కు సాయపడేలా 50 శాతం గ్రాంట్‌ ఇస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement