సేవతోనే ప్రజాప్రతినిధులకు సంతృప్తి | - | Sakshi
Sakshi News home page

సేవతోనే ప్రజాప్రతినిధులకు సంతృప్తి

Mar 13 2026 7:41 AM | Updated on Mar 13 2026 7:41 AM

ప్రజలకు మంచి చేయాల్సిన

బాధ్యత మనది

ప్రజాప్రతినిధుల శిక్షణలో

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

సాక్షిప్రతినిధి, ఖమ్మం: ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అధికారంలో ఉన్న సమయాన మంచి పనులు చేశామనే పేరు సాధిస్తే ప్రజాప్రతినిధులకు సంతృప్తి కలుగుతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇటీవల ఎన్నికై న సర్పంచ్‌లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, వార్డు కౌన్సిలర్లుకు ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహించిన శిక్షణను కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్‌ మట్టా రాగమయితో కలిసి మంత్రి ప్రారంభించి మాట్లాడారరు. ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ అర్హులైన వారికి చేరేలా చూడాలని తెలిపారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కొంత సమయం కేటాయిస్తే క్షేత్రస్థాయిలో మంచి మార్పు కనిపిస్తుందని వెల్లడించారు.

నిధులను సద్వినియోగం చేసుకోవాలి..

పాలకవర్గాలు లేక గ్రామాలకు నిధులు రాకపోగా.. ఇటీవల ఎన్నికలు నిర్వహించాక పెద్ద ఎత్తున నిధులు విడుదల అయ్యాయని మంత్రి పొంగులేటి తెలిపారు. మార్చి 31లోపు మరిన్ని నిధులు విడుదల కానున్నందున ప్రణాళికాయుతంగా చట్టపరిధిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణంలో నాణ్యం ఉండేలా అధికారులు, ప్రజా ప్రతినిధులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

బాధ్యతగా పనిచేస్తేనే అభివృద్ధి :

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా పనిచేస్తే గ్రామాలు, పట్టణాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రజాప్రతినిధుల శిక్షణలో మంత్రి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలు అధిక శాతం విజయం సాధించడం అభినందనీయమన్నారు. గ్రామాలు, పట్టణాల అభివృద్ధిలో స్థానిక సంస్థలే కీలకమైనందున నిధులను న్యాయబద్ధంగా వినియోగించాలని సూచించారు. ఇదేసమయాన సొంత ఆదాయ మార్గాలను పెంచుకోవాలని తెలిపారు. అనంతరం కలెక్టర్‌ అనుదీప్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ను విజయవంతం కావడంలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కీలకమని తెలిపారు. పది అంశాలపై చేపట్టే కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ రాయల నాగేశ్వరరావు, డీఎఫ్‌ఓ సిద్ధార్థ్‌ విక్రమ్‌ సింగ్‌, పంచాయతీ రాజ్‌ డిప్యూటీ కమిషనర్‌, జిల్లా ప్రత్యేక అధికారి విద్యాలత, జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, డీపీఓ రాంబాబు, డీఆర్‌డీఓ కె.శ్రీరామ్‌, ిసీపీఓ ఏ.శ్రీనివాస్‌, డీవైఎస్‌ఓ సునీల్‌ రెడ్డి, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రామారావు, ట్రైబల్‌ వెల్ఫేర్‌ డీడీ ఎన్‌.విజయలక్ష్మి, అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ చందునాయక్‌తో పాటు ఎంపీడీఓలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement