ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న మండలంలోని జమలాపురం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 19వ తేదీ నుంచి స్వామి వారి వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు హాజరుకావా లని కోరుతూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ఈఓ కె.జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ మధిరలో ఆహ్వానపత్రం అందచేశారు. అలాగే, శ్రీవారి శేషవస్త్రాలు, ప్రసాదం అందజేయగా ఉత్సవాల వాల్‌పోస్టర్లు, కరపత్రాలను భట్టి ఆవిష్కరించారు. సర్పంచ్ తుళ్లూరు నిర్మలాకుమారి, వకుళమాత స్టేడియం నిర్మాణదాత తుళ్లూరు కోటేశ్వరరావు, ఆలయ ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ తదితరులు పాల్గొన్నారు.
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8–30 గంటలకు తిరుమలాయపాలెం మండలం బీరోలులో జరిగే శ్రీరా మలింగేశ్వరస్వామి ఆలయ ట్రస్ట్‌బోర్డు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే బీరోలు నుంచి ఏలువారిగూడెం వరకు బీటీ రోడ్డు, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆతర్వాత రాకాసితండాలో ఆకేరు వరద బాధితులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, తిరుమలాయపాలెం మండల మస్జీద్ కమిటీ ఆధ్వర్యాన ముస్లింలకు రంజాన్ తోఫా అందించాక బంధంపల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి దమ్మాయిగూడెంలో జరిగే ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక సమావేశంలో మంత్రి పాల్గొంటారు. అనంతరం 11గంట లకు కామేపల్లి మండలంలో జాస్తిపల్లి, ముచ్చ ర్ల, లాల్యాతండా, ఊటుకూరు, తాళ్లగూడెంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి డబుల్ బెడ్‌రూం ఇళ్ల మంజూరు పత్రాలు అందజేస్తారు.
మూడు జిల్లాల
అవసరాలకు యూరియా
చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు గురువారం సీఐఎల్ కంపెనీకి చెందిన 2,636.77 మెట్రిక్ టన్నుల యూరియా చేరింది. ఇందులో 1,136.77 మె.టన్నులు ఖమ్మం జిల్లాకు, 300 మె.టన్నులను భద్రాద్రి జిల్లాకు కేటాయించినట్లు జిల్లా వ్యవసాయ శాఖాధికారి డి.పుల్లయ్య తెలిపారు. అలాగే, మహబూబాబాద్ జిల్లాకు వేయి మె. టన్నులు రవాణా చేయగా, మరో 200 మె.టన్నులను బఫర్ స్టాక్‌గా నిల్వ చేసినట్లు వెల్లడించారు.
16నుంచి
ఒంటిపూట బడులు
ఖమ్మం సహకారనగర్: వేసవి దృష్ట్యా ఈనెల 16వ తేదీ నుంచి అన్ని పాఠశాలల్లో ఒంటి పూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఉదయం 8నుంచి మధ్యాహ్నం 12–30గంటల వరకు నిర్వహించనున్నారు. పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5గంటల వరకు తరగతులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రతిరోజు మధ్యాహ్నం 12–30గంటల తర్వాత విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తారు.


