పేదలందరికీ లబ్ధి | - | Sakshi
Sakshi News home page

పేదలందరికీ లబ్ధి

Mar 12 2026 7:40 AM | Updated on Mar 12 2026 7:40 AM

ప్రభుత్వం న్యాయం చేసింది రూ.1.80 లక్షలు ఇచ్చాం..

ప్రతీ లబ్ధిదారుకు ఇల్లు..

పేదల ప్రభుత్వంపై

విష ప్రచారం చేస్తున్నారు

రాజకీయ దురుద్దేశాలు లేకుండా

412 మందికి ఇళ్లు

దళారుల నుంచి డబ్బు రికవరీ చేసి బాధితులకు ఇస్తాం

డిప్యూటీ సీఎం భట్టి,

మంత్రులు పొంగులేటి, తుమ్మల

భూదాన్‌ భూముల్లో డిసెంబర్‌ 9న గృహప్రవేశాలు

సాక్షిప్రతినిది, ఖమ్మం : ‘వెలుగుమట్లలో పేదలకు కేటాయించిన భూదాన్‌ భూముల్లో యుద్ధప్రాతిపదికన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తాం. సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా డిసెంబర్‌ 9న ఇందిరమ్మ ఇళ్లలో లబ్ధిదారులతో పాలు పొంగించి.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కాలనీని ప్రారంభింపజేస్తాం’ అని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం వెలుగుమట్ల భూదాన్‌ భూముల్లో నిర్వాసితులైన 311 మందికి ఇళ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను భట్టి విక్రమార్క, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అందజేశారు. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు మండలాలకు చెందిన 101 మంది లబ్ధిదారులకు వారి స్వస్థలాల్లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అధికారులతో పంపిణీ చేయించారు. 311 మంది అర్హులకు ఒకేసారి ర్యాండమైజేషన్‌ ద్వారా ఇళ్ల స్థలాలు కేటాయించి.. ప్లాట్‌ నంబర్లు కేటాయించారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. పేదలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్న తమ ప్రభుత్వంపై కొందరు కావాలనే విమర్శలు చేస్తున్నారని అన్నారు. ప్రతీ వారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిల్లులు విడుదల చేస్తున్నామని తెలిపారు. భూదాన్‌ భూముల్లో పలువురు వచ్చి పేదలను బెదిరించే వారని, భయాందోళనల మధ్య వారు జీవనం గడపగా ఆ పరిస్థితికి తమ ప్రభుత్వం స్వస్తి పలికిందని చెప్పారు. ఈ కాలనీలో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ గురుకులాన్ని సైతం నిర్మిస్తామన్నారు.

పేదల సమస్యలకు పరిష్కారం..

గత ఎనిమిదేళ్లుగా భూదాన్‌ భూముల్లో ఇబ్బందులు పడ్డారని, ఈ సమస్యకు నేడు పరిష్కారం లభించిందని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తాగునీరు, రోడ్లు, ఫంక్షన్‌ హాల్‌, షాపింగ్‌ కాంప్లెక్స్‌, స్కూల్‌, విద్యుత్‌ సరఫరా వంటి మౌలిక వసతుల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని చెప్పారు. అర్హులైన బాధితులు ఎవరైనా మిగిలి ఉన్నా వారికి కూడా ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. పేదలను మోసం చేసి దళారులు వసూలు చేసిన డబ్బు రూపాయి కూడా వదలకుండా పూర్తి స్థాయిలో వసూలు చేసి బాధితులకు అందించాలని పోలీస్‌ కమిషనర్‌ను ఆదేశించారు. ఫిబ్రవరి 24న వెలుగుమట్ల ఇళ్ల కూల్చివేతలు జరిగిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష నాయకులు వచ్చి మొసలి కన్నీరు కార్చారని పొంగులేటి ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం ప్రజల కష్టాలను చూసి చలించి నేడు పట్టాలు పంపిణీ చేస్తోందని చెప్పారు.

మాఫియాపై కేసులు నమోదు చేయాలి

వెలుగుమట్ల భూదాన్‌ భూముల్లో పెద్ద మాఫియా నడుస్తోందని ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న అన్నారు. పేదల నుంచి డబ్బులు వసూలు చేసిన వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. 311 మంది నిరుపేదల కు పట్టాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక కేసుగా పరిగణించి ఇంటి నిర్మాణ నిధులు పెంచాలని కోరారు. కార్యక్రమంలో కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి, సీపీ సునీ ల్‌దత్‌, వైరా ఎమ్మెల్యే రాందాస్‌ నాయక్‌, కార్పొరేషన్‌ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, ఖమ్మం మేయర్‌ పునుకొల్లు నీరజ, కార్పొరేషన్‌ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య, అదనపు కలెక్టర్‌ పి.శ్రీనివాసరెడ్డి, కల్లూరు సబ్‌ కలెక్టర్‌ అజయ్‌ యాదవ్‌, నగర డిప్యూటీ మేయర్‌ ఫాతిమా జొహ రా, డీఆర్‌ఓ ఎ.పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.

ఎనిమిదేళ్లుగా భూదాన్‌ కాలనీలోనే ఉన్నాం. మాకు కరెంటు, రోడ్లు, నీళ్లు లాంటివి లేవు. ఇవన్నీ ఇస్తామని మా దగ్గర రూ.10 వేల నుంచి రూ.50 వేలు తీసుకుని ఇబ్బంది పెట్టారు. మమ్మల్ని ప్రభుత్వం గుర్తించి న్యాయం చేసింది. మాకు ఇప్పుడు చాలా గౌరవంగా ఉంది.

– లక్ష్మీ ప్రసన్న, లబ్ధిదారురాలు

ఇంటి జాగా కోసం రూ.1.80 లక్షలు చెల్లించాం. పట్టాలు రాలేదు, కరెంటు లేదు, నీళ్లు లేవు చాలా ఇబ్బందులు పడ్డాం. మా కష్టాన్ని ప్రభుత్వం గుర్తించినందుకు సంతోషంగా ఉంది. ప్రభుత్వమే పట్టా ఇచ్చి ఇల్లు కట్టిస్తుండడంతో ఇక మాకేబాధ ఉండదు. ఇప్పటికై నా న్యాయం జరిగింది.

– బానోతు భవాని, లబ్ధిదారురాలు

వెలుగుమట్ల నిర్వాసితుల్లో ప్రతీ లబ్ధిదారుకు ఇల్లు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పేదల దగ్గర డబ్బులు వసూలు చేసిన దళారుల వివరాలు పోలీసులకు అందించాలని, వారికి కఠిన శిక్ష పడేలా చూస్తామని అన్నారు. అక్రమ నిర్మాణాలు కూల్చివేసి దగాకోరులను తరిమివేశామని తెలిపారు. నిరుపేదలకు వెలుగుమట్ల భూదాన్‌ భూముల్లో పట్టాలు పంపిణీ చేశామని, వారి పిల్లల భవిష్యత్‌ కోసం ఇక్కడ మోడల్‌ స్కూల్‌ నిర్మిస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement